నెల రోజులు.. పోలీస్ యాక్ట్
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్
నల్లగొండ: శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నెలరోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్ యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిదే జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించవద్దని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగేలా, ప్రజా ధనానికి నష్టం కల్గించేలా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదని తెలిపారు. ఈ నిషేధ ఉత్తర్వులను చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
సాగర్ కాల్వలకు నీటి నిలిపివేత
నాగార్జునసాగర్: సాగర్ కుడి, ఎడమ కాల్వలకు గురువారం సాయంత్రం నీటిని నిలిపి వేశారు. యాసంగి పంటకుగాను అధికారులు గత సంవత్సరం డిసెంబర్ 15 నుంచి ఆయకట్టుకు ఏకధాటిగా నీటిని విడుదల చేశారు. కుడికాల్వ కింద ఏపీలో 10.50 లక్షల ఎకరాలు సాగైంది. ఎడమకాల్వ కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,98,790 ఎకరాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2,63,736 ఎకరాల్లో వరి సాగైంది. ఈ సీజన్‌లో 115 రోజులపాటు కుడి కాల్వకు 100టీఎంసీలు, ఎడమ కాల్వకు 74టీఎంసీల నీటిని విడుదల చేశారు.
ధాన్యానికి మద్దతు
ధర అందించాలి
మిర్యాలగూడ: రైతులు మిల్లు పాయింట్ల వద్దకు తీసుకొస్తున్న ధాన్యానికి మద్దతు ధర అందించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. గురువారం మిర్యాలగూడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌తో కలిసి రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల నుంచి రైస్ మిల్లుల్లో ధాన్యం ధరను తగ్గించి కొనుగోలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, మిల్లర్లు మద్దతు ధరలకు కొనుగోలు చేయాల్సిందేనని అన్నారు. ధర అమాంతం తగ్గించి కొటే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైస్‌మిల్లుల్లో అన్నిరకాల సన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. రైస్ మిల్లుల్లో తూకం తేడాలు రావొద్దన్నారు. ఈ సమావేశంలో జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ హరీష్, తహసీల్దార్ హరిబాబు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి, బండారు కుశలయ్య, జైయిని ప్రకాశ్‌రావు, గుడిపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


