90శాతం పన్ను వసూలు
నల్లగొండ: గ్రామ పంచాయతీల్లో గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2024–25) సంబంధించి ఆస్తిపన్ను వసూలు ప్రక్రియ పూర్తయ్యింది. జిల్లాలో మొత్తం 868 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటి పరిధిలో ఏటా ఏప్రిల్ మొదటి తేదీ ఉంచి జూలై మాసం వరకు నూటికి నూరు శాతం ఆస్తిపన్ను వసూలు చేయాలి. అయితే అప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా పూర్తిస్థాయిలో పన్నులు వసూలు కాకపోవడంతో ప్రభుత్వం గడవు పొడిగించింది. దీంతో మార్చి 31 వరకు మొత్తం 90 శాతం ఆస్తిపన్ను వసూలైంది.
మార్చి 31 నాటికి..
మార్చి 31తో 2024–25 ఆర్ధిక సంవత్సర ముగిసింది. అప్పటి వరకు జిల్లాలో అన్ని పంచాయతీల్లో సంబంధిత అధికారులు, సిబ్బంది ఇంటింటికీ తిరిగి 90 శాతం ఆస్తిపన్ను వసూలు చేశారు. జిల్లాలో మొత్తం రూ.22.28,24,101 వసూలు చేయాల్సి ఉంది. మార్చి 31 వరకు రూ.20,10,47,907 వసూలు చేశారు. ఇంకా 2,17,76,194 వసూలు చేయాల్సి ఉంది. అయితే ఆస్తిపన్నులు గతేడాది 60 శాతం వసూలైతే ప్రస్తుతం 30 శాతం వరకు అధికంగా వసూలైందని అధికారులు పేర్కొంటున్నారు.
పన్ను వసూలుతో ఊరట
గ్రామ పంచాయతీ పాలకవర్గాల కాల పరిమితి ముగిసి సంవత్సర కాలం గడిచింది. దీంతో పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అయితే పాలవర్గాల గడువు ముగియడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్ధిక సంఘం నిధులు నిలిచిపోయాయి. పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు జనాభా ఆధారంగా ప్రతినెలా కేంద్రం నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చేది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఆగిపోవడంతో మౌలిక వసతులు, అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పంచాయతీలకు ఆస్తిపన్ను రూపంలో 90 శాతం వసూలు కావడం కొంత ఊరట లభించినట్టు అయ్యింది. వసూలైన పన్నును గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది.
అత్యవసర పనులకు ఖర్చు చేయొచ్చు
ఆస్తి పన్ను వసూలు ద్వారా వచ్చిన డబ్బును గ్రామసభల తీర్మానం మేరకు అత్యవసర పనులకు వినియోగించుకోవచ్చు. గ్రామంలో తాగునీరు, ఇతర ఏ పని ప్రజలకు అవసరమని భావిస్తారో ఆ పనులకు సంబంధించి ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి తీర్మానం చేసి ఖర్చు చేయాల్సి ఉంటుంది.
– వెంకయ్య, డీపీఓ, నల్లగొండ
గ్రామ పంచాయతీల్లో ముగిసిన ఆస్తిపన్ను వసూలు ప్రక్రియ
ఫ క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరిగి
వసూలు చేసిన సిబ్బంది
ఫ గతేడాది కంటే 30శాతం అధికంగా
వసూలైందన్న అధికారులు


