రామగిరి(నల్లగొండ) : మిర్యాలగూడలో జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు సుదీర్ఘ విచారణ అనంతరం నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ నెల 10వ తేదీన ఒకరికి మరణశిక్ష, మిగతా వారికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. ఈ హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్థంగా కోర్టులో సమర్పించడంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహ పాత్ర కీలకం. ఈ కేసు విచారణ జరిగిన తీరును బుధవారం ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. కేసు ఎందుకు వాదించాల్సి వచ్చింది? కేసు జరుగుతున్న సమయంలో సాక్ష్యాధారాలు ఎలా సేకరించారు? తదితర వివరాలను ఆయన వెల్లడించారు.
2018 సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ హత్య జరిగింది. నిందితులపై కేసు నమోదు కావడం కోర్టులో హాజరు పరిచారు. నిందితులు బెయిల్‌పై విడుదల అయ్యారు. దీంతో ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యర్థన మేరకు అప్పటి కలెక్టర్ వి.చంద్రశేఖర్ 2019డిసెంబర్ 2న ఈ కేసుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించారు. అప్పటికే పీడీ యాక్ట్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చిన మారుతీరావు తన కూతురు అమృతవర్షిణిని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఆయన బెయిల్ రద్దు చేయాలని అమృత కోర్టులో పిటిషన్ వేసింది. ఆ తర్వాత మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
2020లో చార్జిషీట్
ఈ కేసులో 2020డిసెంబర్ 20న కోర్టు చార్జిషీట్ నమోదు అయింది. ప్రణయ్ తండ్రి బాలస్వామి, భార్య అమృతవర్షిణి, తల్లి ప్రేమలత స్టేట్‌మెంట్, 20 రోజుల పాటు క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. కోవిడ్ తర్వాత కేసు విచారణలో కొంత జాప్యం జరిగింది. 2022జూలై 26న జడ్జి బి.తిరుపతి బాధ్యతలు తీసుకున్నాక నిందితులతో పాటు సాక్షుల స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. 2024 జూలైలో జడ్జిగా ఎన్.రోజారమణి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సమయంలో కేసు విచారణ వేగంగా కొనసాగింది. కేసులో కోర్టుకు 102 మంది సాక్షుల పేర్లను సమర్పించగా 78 మంది సాక్షులను విచారించారు. 293 పేజీల డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించాం.
పరువు హత్యలు ఆగాలి..
ఈ కేసులో 472 పేజీల రాత పూర్వక వాదనలను, ఏడు సుప్రీం కోర్టు జడ్జిమెంట్లను కోర్టుకు సమర్పించా. 523 పేజీలతో కోర్టు తీర్పు ఇచ్చింది. డిఫెన్స్ న్యాయవాదుల వాదనలను సమర్థంగా తిప్పికొట్టి అన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించడంతో నిందితులకు కఠినశిక్షలు పడ్డాయి. ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తమిళనాడు రాష్ట్రంలోని పలు పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. అనేక డిబేట్‌లు జరుగుతున్నాయి. న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగింది. కుల హత్యలకు పాల్పడే వారికి ఈ తీర్పు కనువిప్పునిస్తుంది. ఇప్పటికీ కుల పరమైన దాడులు, హత్యలు జరుగుతున్నాయి. అవన్నీ ఈ తీర్పుతో ఆగాలి.
ఫ ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యర్థనతో స్పెషల్ పీపీగా నియమించారు
ఫ ఈ కేసులో 472 పేజీల రాత పూర్వక వాదనలు కోర్టుకు సమర్పించా
ఫ ఏడు సుప్రీం కోర్టు జడ్జిమెంట్లను అందజేశా
ఫ కుట్రలన్నీ కోర్టులో నిరూపణయ్యాయి
‘సాక్షి’తో స్పెషల్ పబ్లిక్
ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహ