భువనగిరి చామలకే.. | Sakshi
Sakshi News home page

భువనగిరి చామలకే..

Published Thu, Mar 28 2024 1:40 AM

- - Sakshi

కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌ చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి ఖరారు చేసిన సీఈసీ

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : భువనగిరి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేరును ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఖరారు చేసింది. బుధవారం ఢిల్లీలో జరిగిన సీఈసీ సమావేశంలో కిరణ్‌కుమార్‌రెడ్డి అభ్యర్థిత్వానికి ఓకే చెప్పింది. మొదటి జాబితాలోనే నల్లగొండ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్టానం.. భువనగిరి అభ్యర్థి విషయాన్ని తేల్చలేదు. దీంతో టికెట్‌ ఎవరికి దక్కనుందోనని ఆశావహులతో పాటు పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు అభ్యర్థిని ప్రకటించి సస్పెన్స్‌కు తెరదించింది.

మొదటి నుంచి టికెట్‌పై ఆశలు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా, టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఏడాదిన్నర కాలంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న చామల కిరణ్‌కుమార్‌రెడ్డి.. మొదటి నుంచి తనకు భువనగిరి టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. టికెట్‌ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే ఎవరిని బరిలో నిలుపాలన్న విషయంలో అధిష్టానం మొదటి విడతలో ఓ నిర్ణయానికి రాలేకపోయింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్న కుమారుడు కోమటిరెడ్డి సూర్య పవన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కలువడంతో ఆయన్ని ఎంపీగా బరిలో నిలుపుతారన్న చర్చ సాగింది. మధ్యలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ తరఫున నిలబెట్టాలని ఆ పార్టీ భావించగా అందుకు ఆయన నిరాకరించారు. దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని, ఆయనకే ఎంపీ టికెట్‌ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఆయన కాంగ్రెస్‌లో చేరకపోవడంతో ఆ ప్రచారం ఉత్తిదేనని తేలిపోయింది. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిని బరిలో నిలుపాలంటూ అధిష్టానం రాజగోపాల్‌రెడ్డిపై ఒత్తిడి పెంచుతోందన్న చర్చ నడిచింది. ఇదే తరుణంలో తాము ఎంపీ టికెట్‌ అడగడం లేదని, తాము టికెట్‌ అడుగుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం పోటీ చేయాలని మరింత ఒత్తిడి చేస్తే ఆలోచిస్తామని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో భువనగిరి టికెట్‌ చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి లేదంటే కోమటిరెడ్డి లక్ష్మికే ఇస్తారని చర్చ సాగింది.

తెరపైకి బీసీ అంశం

బీఆర్‌ఎస్‌, బీజేపీ బీసీ అభ్యర్థులను పోటీలో నిలిపిన నేపథ్యంలో కాంగ్రెస్‌ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పోటీలో ఉంచాలని, భారీ మెజారిటీతో గెలిపించి తీసుకువస్తామని తాను రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీకి తెలియజేసినట్లు ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు. దీంతో బీసీ అంశం తెరపైకి వచ్చింది. అయితే ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్‌ అధిష్టానం కిరణ్‌కుమార్‌రెడ్డి పేరును ఖరారు చేసింది. ఇదిలా ఉండగా బీజేపీ, బీఆర్‌ఎస్‌, సీపీఎం పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్‌ కూడా అభ్యర్థిని ఖరారు చేయడంతో ఇక ప్రచారం హోరెత్తనుంది.

ఫ ఎట్టకేలకు సస్పెన్స్‌కు తెర

ఫ తేలిన ప్రధాన పార్టీల అభ్యర్థులు

ఫ హోరెత్తనున్న ఎన్నికల ప్రచారం

పేరు : చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

పుట్టిన తేదీ : 24 అక్టోబరు, 1974

తండ్రి : చామల వాసుదేవరెడ్డి

స్వగ్రామం : తుంగతుర్తి నియోజకవర్గం, శాలిగౌరారం

విద్యాభ్యాసం: హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా

2008 –2009 : జాతీయ యువజనకాంగ్రెస్‌ కార్యదర్శి

(మహారాష్ట్ర, గోవా, డెహ్రాడూన్‌,

హవేలీ ఇన్‌చార్జి)

2005 –2006 వరకు : ఆంధ్రప్రదేశ్‌

యువజన కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ

2007 – 2008 వరకు : రాహుల్‌గాంధీ టీం అయిన డిస్కవరీ ఇండియా టాస్క్‌ఫోర్స్‌ మెంబర్‌, ఆమ్‌ ఆద్మీకా సీపాహి నేషనల్‌ కోఆర్డినేటర్‌

2009 –2011 వరకు : జాతీయ యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి

(తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌, పాండిచ్చేరి ఇన్‌చార్జి)

2017 – 2021 : టీపీసీసీ అధికార ప్రతినిధి

2021 నుంచి : టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Advertisement
Advertisement