నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

భీమనపల్లిలో విచారణ చేస్తున్న డీఎల్‌పీఓ  - Sakshi

రామగిరి(నల్లగొండ) : నిరుద్యోగ యువతీ యువకులకు డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచితంగా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, కంప్యూటర్‌, టైపింగ్‌, ఇంటర్వ్యూ స్కిల్స్‌ కోర్సులకు శిక్షణ అందిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందన్నారు. పది, ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసిన వారు మార్చి 4వ తేదీలోపు నల్లగొండలోని కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని.. పూర్తి వివరాలకు 70326 49925 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

ఏప్రిల్‌ నెలకు రేషన్‌ కేటాయింపు

నల్లగొండ : ఏప్రిల్‌ నెలకు సంబంధించి జిల్లాలోని 4,66,234 రేషన్‌ కార్డులకు కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్‌ కోటాను కేటాయించింది. ఎఫ్‌ఎస్‌సీ కార్డుదారులకు యూనిట్‌కు 6 కిలోల చొప్పున, ఏఎఫ్‌ఎస్సీ కార్డుదారులకు 35 కిలోల చొప్పున, అన్నపూర్ణ కార్డుదారులకు 10కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందించనున్నారు. ఏఏవై కార్డుదారులకు రూ.13.50కు కేజీ చెక్కర ఇవ్వనున్నారు. మున్సిపాలిటీల్లో కార్డుదారులకు కేజీ చొప్పున గోదుమలను అందించనున్నారు. అందుకు సంబంధించి జిల్లాకు ప్రభుత్వం కోటాను కేటాయించిందని జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.

‘కంటి వెలుగు’ను వినియోగించుకోవాలి

మిర్యాలగూడ టౌన్‌ : ప్రతి న్యాయవాది కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ సీనియర్‌ సివిల్‌ జడ్జి సీహెచ్‌ ఆశాలత, ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.స్వర్ణలత, రెండో అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి వినుకొండ మాధవి అన్నారు. మంగళవారం స్థానిక బార్‌ అసోసియేషన్‌ భవనంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని వారు ప్రారంభించారు. అనంతరం డాక్టర్లు లక్ష్మిప్రసన్న, డాక్టర్‌ జీవిత న్యాయమూర్తులకు కంటి పరీక్షలను నిర్వహించారు. వైద్య బృందం స్వయంగా వచ్చి న్యాయవాదులకు కంటి వెలుగు ద్వారా పరీక్షలను చేయడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు జి.రామకృష్ణారెడ్డి, జంగిలి ఎల్లయ్య, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు వాసుదేవారెడ్డి, శ్రీనివాస్‌స్వామి, వెంకటయ్య, వెంకటేశ్వర్లులతో పాటు సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు తదితరులున్నారు.

నిధుల దుర్వినియోగంపై డీఎల్‌పీఓ విచారణ

మాడుగులపల్లి : మండలంలోని భీమనపల్లి, సీత్యాతండా, గండ్రవానిగూడెం గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం జరిగిందన్న అభియోగాలపై మంగళవారం డీఎల్‌పీఓ ప్రతాప్‌నాయక్‌ విచారణ చేపట్టారు. పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన సమాచార హక్కు సంరక్షణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు అనంతాచారి ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి సమక్షంలో ఆయా పంచాయతీల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆయా పంచాయతీల్లో ఎంబీ రికార్డులు, క్యాష్‌ బుక్స్‌, ఇతర రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. రికార్డులను పరిశీలించి నెలరోజుల్లో జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక డీఎల్‌పీఓ అందజేస్తామన్నారు.

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top