నాగర్‌కర్నూల్ రూరల్/పెద్దకొత్తపల్లి: జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లను శుక్రవారం కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారుల బృందం పరిశీలించింది. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లతో పాటు జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం మినీ ట్యాంక్‌బండ్ ఆనకట్టలను కేంద్ర జలవనరుల కమిషన్ చైర్మన్ అశోక్‌కుమార్, సభ్యులు భూషణ్‌రాజు, శ్రీకాంత్‌రావు, గుల్షన్ శర్మ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జలవనరుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. రిజర్వాయర్ల నిర్మాణ స్థితి, భద్రతా ప్రమాణాలు, భవిష్యత్ అవసరాలపై సంబంధిత అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. రిజర్వాయర్ల భద్రతకు సంబంధించిన పలు సూచనలు చేశారు. వారి వెంట ఇరిగేషన్ సీఈ విజయభాస్కర్‌రెడ్డి, డీఈ లోకిలాల్, అమర్‌సింగ్, రవీందర్, లక్ష్మణ్, సర్పంచ్ ఆది ధర్మేందర్ ఉన్నారు.


