జిల్లాలో మందకొడిగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్
గ్రామాల్లో హెచ్‌పీవీపై అవగాహన కల్పిస్తున్నాం. బాలికలు టీకా వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఈ వ్యాక్సిన్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయోనని అంటున్నారు. ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి ఎక్కువ మందికి వేయడానికి ప్రయత్నిస్తాం.
– కృష్ణ, డీఎంహెచ్‌ఓ
కందనూలు: మహిళల ఆరోగ్యాన్ని తీవ్ర ప్రభావితం చేసే వ్యాధుల్లో ఒకటైన గర్బాశయ ముఖద్వారా కేన్సర్ ప్రధాన సమస్యగా మారుతోంది. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం 14–15 ఏళ్ల బాలికలకు హ్యూమన్ పాపిలోమ వ్యాక్సిన్ (హెచ్‌పీవీ) అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు టీకా కార్యక్రమాన్ని గత మార్చి 8న ప్రారంభించగా.. జిల్లాలో మాత్రం నత్తనడకన సాగుతోంది. విద్యార్థినులకు సరైన అవగాహన కల్పించడంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో టీకా వేయించుకోవడానికి బాలికలు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు.. సరైన పద్ధతిలో అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
కేన్సర్ నివారణలో కీలక పాత్ర..
హెచ్‌పీవీ వైరస్‌తో గర్బాశయ ముఖద్వార కేన్సరే కాకుండా ఇతర ప్రమాదకర కేన్సర్లు వచ్చే అవకాశముంది. ఈ వైరస్ ప్రభావాన్ని ముందుగానే అరికట్టేందుకు హెచ్‌పీవీ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందడంతోపాటు పలు రకాలైన వ్యాధులు రాకుండా కాపాడుతోంది. సుమారు ఆరు రకాల కేన్సర్లను గణనీయంగా తగ్గించవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
జిల్లాలో 5,986మంది గుర్తింపు..
జిల్లా వైద్యారోగ్యశాఖ గణాంకాల ప్రకారం 14–15 ఏళ్ల వయసు గల 5,986 మంది బాలికలకు హెచ్‌పీవీ ఇవ్వడానికి గుర్తించారు. ఇప్పటివరకు 918 మందికి మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇది దాదాపు 15శాతం మాత్రమే. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో టీకా కార్యక్రమం చేపడుతున్నారు.
అవగాహన కల్పించడంలో విఫలం..
హెచ్‌పీవీపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ విఫలమైందని కొందరు విమర్శిస్తున్నారు. ఆరోగ్యశాఖ అధికారులు పాఠశాలలు, కళాశాలలు, గ్రామస్థాయిలో వ్యాక్సిన్‌పై ప్రాధాన్యతను వివరించడంలో నిర్లక్ష్యం వహించడంతో గ్రామాల్లో పూర్తిస్థాయిలో ముందుకు రావడంలేదని అభిప్రాయపడుతున్నారు. బాలికల భవిష్యత్, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని హెచ్‌పీవీ ఆవశ్యతకపై వైద్యాధికారులు, ఇతర సిబ్బంది విస్తృతంగా అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.
మొత్తం 5,986 మందికి గాను
918 మందికే టీకా
15శాతం మాత్రమే వ్యాక్సినేషన్
అవగాహన కల్పించడంలో వైద్యారోగ్యశాఖ విఫలం


