సోమశిలలో కలెక్టర్‌ దంపతులు | - | Sakshi
Sakshi News home page

సోమశిలలో కలెక్టర్‌ దంపతులు

Jun 27 2026 2:13 AM | Updated on Jun 27 2026 2:13 AM

కొల్లాపూర్‌ రూరల్‌: మండలంలోని సోమశిలను శుక్రవారం కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ సతీసమేతంగా సందర్శించారు. వారికి జిల్లా పర్యాటకశాఖ, రెవెన్యూ అధికారులు ఘనస్వాగతం పలికారు. కలెక్టర్‌ దంపతులు సోమేశ్వరాలయం, లలితాంభిక అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నది అవతల ఒడ్డున్న ఉన్న సంగమేశ్వరుడిని దర్శించుకునేందుకు టూరిజం బోటులో వెళ్లారు. అక్కడి నుంచి బోటులో అక్కమాంబ గుహాలను సందర్శించారు. వారి వెంట ఆర్డీఓ బన్సీలాల్‌, జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, రెవెన్యూ అధికారి గోవిందరెడ్డి, సర్పంచ్‌ కాటం వెంకటలక్ష్మి ఉన్నారు.

దీర్ఘకాలిక ఉద్యాన సాగుపై పరిశోధనలు చేయాలి

కొత్తకోట రూరల్‌: ఉద్యాన కళాశాల విద్యార్థులు ఉసిరి, చింత, నేరేడు వంటి దీర్ఘకాలిక ఉద్యాన పంటలపై మరిన్ని పరిశోధనలు చేపట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి కోరారు. వనపర్తి జిల్లాలోని మోజర్లలో ఉన్న ఉద్యాన కళాశాల 19వ వార్షికోత్సవాన్ని గురువారం రాత్రి నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన సాగు కు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల మార్పిడీ విధానాన్ని అనుసరిస్తూ ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ఉద్యాన విభాగం డీన్‌ డా. జె.చీనానాయక్‌ మాట్లాడుతూ.. కళాశాల విద్యార్థులు విద్యారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. ఉన్నత ర్యాంకులు సాధించి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంఎస్సీ చదివే లక్ష్యంతో విశ్వవిద్యాలయ పరిధిలో జేఆర్‌ఎఫ్‌ కోచింగ్‌ సెంటర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్‌ డీన్‌ వీణాజ్యోషి, సర్పంచ్‌ చంద్రశేఖర్‌, మార్కెట్‌యార్డ్‌ వైస్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

పీసీసీ పార్లమెంట్‌

కో–ఆర్డినేటర్ల నియామకం

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని పార్టీపరంగా పర్యవేక్షించేందుకు గాను పార్లమెంట్‌ సెగ్మెంట్ల వారీగా కంట్రోల్‌ రూం కో–ఆర్డినేటర్లను నియమిస్తూ తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒబేదుల్లా కొత్వాల్‌, మహబూబ్‌నగర్‌కు టి.రేవతిగౌడ్‌ నియమితులయ్యారు.

ఓబీసీ, ఎస్పీ మోర్చా అధ్యక్షుల నియామకం

పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఓబీసీ మోర్చా, ఎస్సీ మోర్చా అధ్యక్షులను నియామిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా పి.యాదయ్య, వనపర్తి కొమ్ము శ్రీను, నాగర్‌కర్నూల్‌ జెట్టి వెంకటేష్‌ను నియమించారు. అలాగే మహబూబ్‌నగర్‌ బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడిగా మిట్టమీది నాగరాజు, వనపర్తి జిల్లాకు ప్రవీణ్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాకు భూషయ్య, గద్వాల జిల్లా ఆంజనేయులును నియమించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement