అమరచింత: కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో కనీస సౌకర్యాలు కొరవడి విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆరోపించారు. శుక్రవారం మండలంలోని పాంరెడ్డిపల్లి శివారులో ఉన్న కస్తూర్బాగాంధీ పాఠశాల, కళాశాలను ఆయన సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వంటగదితో పాటు తరగతి గదులు, డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో ఆరోతరగతి నుంచి పదోతరగతి వరకు అదేవిధంగా జూనియర్ కళాశాలలో మొత్తం 400 మంది బాలికలు విద్య అభ్యసిస్తున్నట్లు ఆయన తెలిపారు. హిందీ ఉపాధ్యాయురాలు లేరని, తాగునీరు, స్నానాలకు నీటివసతి లేక విద్యార్థినులు ఇబ్బందులు పడటం బాధాకరమన్నారు. శుద్ధజల యంత్రం మరమ్మతుకు గురికావడంతో బోరునీటినే తాగుతున్నారని.. మంచాలు లేకపోవడంతో కిందనే పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్‌లో కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని.. అప్పుడే విద్యారంగ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. బడులతో పాటు గురుకులాలు, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కస్తూర్బాల్లో మౌలిక వసతులు సైతం కల్పించలేని దీన స్థితిలో రాష్ట్ర సర్కార్ ఉండటం శోచనీయమన్నారు. సరిపడా తరగతి గదులతో పాటు ఉపాధ్యాయులను నియమించలేని దుస్థితి ఉందని తెలిపారు. సీఆర్టీలకు కనీస వేతనం నెలకు రూ.25 వేలు చెల్లించకపోవడం, విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా స్కావెంజర్లను నియమించకపోవడంతో బాలికలే తమ తరగతి గదులను శుభ్రం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం లేదని, క్రీడాసామగ్రి సమకూర్చి పీఈటీలను నియమించి విద్యతో పాటు క్రీడా నైపుణ్యాలు పెంపొందించాలని డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, కస్తూర్బా, గురుకులాలను సందర్శించే కార్యక్రమం చేపట్టామని.. సమస్యలు తెలుసుకొని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విన్నవిస్తామని చెప్పారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ


