కొండెక్కిన కూరగాయలు
● ఏది కొనాలన్నా..
కిలో రూ.80 పైగా ధర
● అదే దారిలో ఆకుకూరలు
● వారంలోనే అమాంతం పెరుగుదల
●
ధరలు బాగా పెరిగాయి..
వారం రోజుల వ్యవధిలోనే కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. గతవారం వరకు రూ. 300 తీసుకొని మార్కెట్‌కు వెళ్తే వారానికి సరిపడా కూరగాయల వచ్చేవి. ఆ డబ్బులతో ప్రస్తుతం రెండు, మూడు కిలోలు కూడా రావడం లేదు. గతంలో కిలోకు తగ్గకుండా కొనేదాన్ని. ప్రస్తుతం పావుకిలో, అర్ధకిలోతో సరిపెట్టుకుంటున్నాం. – అరుణ,
గృహిణి, ఈశ్వర్‌కాలనీ, నాగర్‌కర్నూల్
పెద్దగా గిరాకీ లేదు..
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దిగుబడి తగ్గింది. దాని వల్ల కూరగాయల ధరలు పెరిగాయి. గతంలో రోజుకు రూ. 2వేల వరకు అమ్మేవాడిని. ప్రస్తుం రూ.వెయ్యి కూడా రావడం లేదు. ప్రజలు పావుకిలో, అర్ధకిలో తీసుకెళ్తున్నారు. ధరలు పెరగడం వల్ల పెద్దగా గిరాకీలు లేవు. – రాములు,
కూరగాయల వ్యాపారి, నాగర్‌కర్నూల్
కూరగాయలు సెప్టెంబర్ నవంబర్
టమాటా 20 30–40
పచ్చిమిర్చి 70 80
బెండకాయ 60 100
కాకరకాయ 70 100
బీన్స్ 80 120
క్యారెట్ 60 120
బీట్‌రూట్ 50 100
క్యాబేజీ 60 100
క్యాప్సికం 70 120
గోకరికాయ 60 100
వంకాయ 50 100
దొండకాయ 60 100
కందనూలు: కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలు వినియోగదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి, దిగుబడి లేకపోవడం.. అధిక వర్షాల ప్రభావంతో వారం, పది రోజుల వ్యవధిలోనే ధరలు అధికమయ్యాయి. మార్కెట్‌లో ఏది కొనాలన్నా కిలో రూ. 80 పైగా ధర పలుకుతోంది. ధరలు అమాంతం పెరగడంతో పావుకిలో, అర్ధకిలోతో సరిపెట్టుకుంటున్నారు. వారం రోజుల క్రితం రూ. 300కు వచ్చిన సరుకులు.. ఇప్పుడు రూ. 600 పట్టుకెళ్లినా సంచి నిండటం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మార్కెట్లలో కూరగాయల ధరలు చూసి జనం బేజారవుతున్నారు.
దిగుమతి చేసుకోవాల్సిందే..
జిల్లాలో చాలా వరకు కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేస్తుంటారు. అందులో టమాటా, కాకరకాయ, బీరకాయ, చిక్కుడు, దోసకాయ, క్యారెట్, క్యాబేజీ, ఆలుగడ్డ, బీన్స్ ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిందే. టమాటా ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె, కర్నూలు నుంచి ఎక్కువగా దిగుమతి చేస్తున్నారు. క్యాప్సికం, బీన్స్, బెంగళూరు నుంచి వస్తుంటాయి, కాలీప్లవర్, క్యాబేజీ, బీట్‌రూట్, కీరా హైదరాబాద్, షాద్‌నగర్, శంషాబాద్ మార్కెట్ల నుంచి తెస్తుంటారు.
ఆకుకూరలు సైతం..
కూరగాయల ధరలు అధికమని భావిస్తున్న తరుణంలో ఆకుకూరల ధరలు కూడా అమాంతం పెరిగాయి. పాలకూర, మెంతంకూర, గోంగూర, తోటకూర, చుక్కకూరల రేట్లు భారీగా పెరగడంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు.
దిగుబడి లేక..
జిల్లాలో కూరగాయల సాగు నామమాత్రంగానే ఉంటుంది. మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా దిగుబడి తగ్గిపోయింది. దీంతో ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు. దీనికి తోడు ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకోవడం వల్ల రవాణా ఖర్చులు అధికమై ధరల పెరుగుతున్నాయని అమ్మకందారులు చెబుతున్నారు.
కొండెక్కిన కూరగాయలు
కొండెక్కిన కూరగాయలు


