క్రీడల్లో సత్తా చాటాలి : డీవైఎస్‌ఓ
కల్వకుర్తి రూరల్: ప్రభుత్వం క్రీడాకారులకు అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తోందని.. తమకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొని రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటాలని డీవైఎస్‌ఓ సీతారాం నాయక్ అన్నారు. ఆదివారం కల్వకుర్తి మండలం మార్చాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో కబడ్డీ జిల్లా జూనియర్, సీనియర్ జట్ల ఎంపిక పోటీలను ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీవైఎస్‌ఓ మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థి ఆసక్తిగల క్రీడలో ప్రావీణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. కబడ్డీ జిల్లా జూనియర్, సీనియర్ జట్ల ఎంపిక పోటీల్లో ప్రతిభకనబరిచిన క్రీడాకారులను డిసెంబర్ 5 నుంచి 8వ తేదీ వరకు మహబూబ్‌నగర్, కరీంనగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యాదయ్య, రమేశ్, భాస్కర్, జంగయ్యగౌడ్, శ్రీనివాసులు, మోహన్, డాక్య, రామన్‌గౌడ్ పాల్గొన్నారు.


