అదిగో.. పులి
అమ్రాబాద్ టైగర్ రిజర్వులో జంతుగణన–2026కు సిద్ధం
అచ్చంపేట: రాష్ట్రంలో పులుల సంఖ్య తెల్చేందుకు అటవీశాఖ సిద్ధమైంది. జాతీయ పులుల సంరక్షణ యాజమాన్యం (ఎన్‌టీసీఏ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నాలుగేళ్లకోసారి.. రాష్ట్రస్థాయిలో అటవీశాఖ ప్రతి ఏటా జంతుగణన చేపడుతోంది. ఇందులో భాగంగా నల్లమలలో పులుల లెక్కింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఈసారి పులుల గణన–2026లో పాల్గొనేందుకు ఆసక్తి గల స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు, జంతు ప్రేమికులు, ఔత్సాహిక యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 18– 60 ఏళ్ల వయసు కలిగి.. రోజూ అడవి మార్గంలో 10– 15 కి.మీ., వరకు నడిచే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమం కావడంతో ఎలాంటి పారితోషికం ఇవ్వరు. అవసరమైన వసతి, రవాణా సౌకర్యం అటవీశాఖ కల్పిస్తుంది. వచ్చే జనవరి 17 నుంచి 23వ తేదీ వరకు అమ్రాబాద్ (నల్లమల) అభయారణ్యంలోని 220 అటవీ బీట్లలో పులుల గణన చేపట్టనున్నారు. ఈసారి డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) వన్యప్రాణుల గణనను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పులులతోపాటు ఇతర శాఖాహార, మాంసాహార జంతువుల లెక్కింపు చేపట్టనున్నారు.
జనవరి 17 నుంచి 23 వరకు కొనసాగనున్న ప్రక్రియ
ఈసారి లెక్కింపులో ఔత్సాహిక యువకులకు అవకాశం
స్వచ్ఛంద సంస్థల వలంటీర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
ఈ నెల 22తోముగియనున్న స్వీకరణ గడువు


