సమాజాన్ని ఏకం చేయడమే లక్ష్యం
కందనూలు: సమాజాన్ని ఏకం చేయడమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమని ముఖ్యవక్త, రిటైర్డ్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలో పథ సంచలన్ కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన ఉత్సవాల్లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సామాజిక చైతన్యాన్ని ప్రజల్లో కలిగించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత సమాజంలో ధర్మపరిరక్షణ కోసం హిందువుగా జీవించాల్సిన అవసరం ఉందన్నారు. కుల ప్రస్తావన లేకుండా సామాజిక సమరసతతో సమాజం ఏకం కావాలన్నారు. హిందూ సమాజం గొప్పదనం చాటడంతో పాటు వసుదైక కుటుంబ వ్యవస్థ, సనాతన ధర్మాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.
ఆకట్టుకున్న పథ సంచలన్..
స్వయం సేవకులు జిల్లా కేంద్రంలో చేపట్టిన పథ సంచలన్ ఆకట్టుకుంది. స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలోని వేంకటేశ్వర ఆలయం నుంచి ఒక గ్రూపు, పాత బజారులోని ఈదమ్మ గుడి నుంచి రెండో గ్రూపు పట్టణంలోని పురవీధుల గుండా బయలుదేరి.. నల్లవెల్లి రోడ్డులో కలుసుకున్నారు. అక్కడి నుంచి అంబేడ్కర్ చౌరస్తా, ప్రధాన రహదారి మీదుగా బాలుర ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకున్నారు. పథ సంచలన్‌లో పాల్గొన్న స్వయం సేవకులపై స్థానికులు పూలవర్షం కురిపించారు. కార్యక్రమంలో విభాగ్ సంఘచాలక్ వేమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా సంఘచాలక్ నారాయణ, విభాగ్ కార్యవాహ పత్తికొండ రాము, జిల్లా సహ కార్యనిర్వవాహ నాగయ్య, నగర కార్యవాహ వేముల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.


