కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమం

Nov 10 2025 8:42 AM | Updated on Nov 10 2025 8:42 AM

కార్మ

కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమం

తెలకపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రతి కార్మికుడు ఉద్యమబాట పట్టాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఆదివారం తెలకపల్లిలో నిర్వహించిన సీఐటీయూ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. కార్మికుల పని గంటలు, ఉద్యోగ భద్రత కోసం పోరాడేందుకు సిద్ధం కావాలన్నారు. ఈ నెల 30న సీఐటీయూ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహాసభల్లో కార్మిక ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని.. కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాసులు జిల్లా ఉపాధ్యక్షుడు వర్దం పర్వతాలు, పొదిలి రామయ్య, శంకర్‌ నాయక్‌, శివవర్మ, పసియొద్దీన్‌, దశరథం, పార్వతమ్మ ఉన్నారు.

సంక్షేమ హాస్టళ్లలో

సమస్యలు పరిష్కరించాలి

కందనూలు: సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు బంగారుబాబు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చాలా హాస్టళ్లలో విద్యార్థులకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలల తలుపులు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు. సంబంధిత అధికారులు హాస్టళ్లను పరిశీలించి.. సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదే విధంగా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రసాద్‌, రమేశ్‌, శివ, బాబు, శ్రీకాంత్‌, మల్లేష్‌, జీవన్‌ పాల్గొన్నారు.

నేడు అప్రెంటీస్‌షిప్‌ మేళా

వనపర్తి రూరల్‌: మండలంలోని రాజపేట శివారులో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సోమ వారం అప్రెంటీస్‌షిప్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ రమేష్‌బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు మేళాను సద్వినియోగం చేసుకోవాలని.. నిజ ధ్రువపత్రాలతో హాజరుకావాలని పేర్కొన్నారు.

సర్వీస్‌ ఉపాధ్యాయులకు ‘టెట్‌’ పెట్టొద్దు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా చూస్తామని టీపీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీపీఆర్టీయూ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టెట్‌ అనేది కేవలం ఉపాధ్యాయులకు ఒక అర్హత పరీక్ష అని, కేంద్ర ప్రభుత్వం చెప్పిందని వెంటనే టెట్‌ అర్హత సాధించాలని రాష్ట్రం కూడా చెప్పడంతో ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉందన్నారు. పరీక్ష అవసరం లేకుండా ఉండాలంటే ఆర్టీఈ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని, అందుకోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించేందుకు త్వరలో ఢిల్లీకి వెళ్తున్నామన్నారు. అధికారంలోనికి వచ్చిన వెంటనే పీఆర్సీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రెండేళ్లు గడిచినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం దీనిపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలన్నారు. జీఓ 317లో భాగంగా వేరే జిల్లాలకు వెళ్లిన స్కూల్‌ అసిస్టెంట్‌లు సొంత జిల్లాలకు వచ్చేలా ప్రయత్నిస్తామని చెప్పారు. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించి.. 40 వేల పోస్టులకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం అని, పండిట్‌, పీఈటీలను కూడా అప్‌గ్రేడ్‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌, నాయకులు శ్యాంబాబు, భూపతిసింగ్‌ పాల్గొన్నారు.

కార్మిక వ్యతిరేక  విధానాలపై ఉద్యమం 
1
1/2

కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమం

కార్మిక వ్యతిరేక  విధానాలపై ఉద్యమం 
2
2/2

కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement