ప్రణాళికాబద్ధంగా తరగతులు నిర్వహించండి
కందనూలు: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ స్కూళ్లలో పదో తరగతి, ఇంటర్మీడియట్ తరగతులను ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలని రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కొనసాగుతున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థుల నమోదు, హాజరు వివరాలను పరిశీలించారు. రెండో శనివారం, ఆదివారం నిర్వహించే తరగతులకు విద్యార్థులు వందశాతం హాజరయ్యేలా కృషి చేయాలని ఓపెన్ స్కూల్ సెంటర్ కోఆర్డినేటర్లకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం దూరవిద్య విధానంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ విద్యాపీఠం జారీ చేసే సర్టిఫికెట్లతో ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందేందుకు అర్హత ఉంటుందన్నారు. జిల్లాలో 18 ఓపెన్ స్కూల్ సెంటర్లు కొనసాగుతున్నాయని.. 2025–26 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతిలో 403 మంది, ఇంటర్మీడియట్‌లో 996 మంది అడ్మిషన్లు పొందినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్షలు రాసే అవకాశం ఉందన్నారు. మధ్యలో చదువు ఆపేసిన వారికి ఇదొక సువర్ణావకాశమని.. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివప్రసాద్, నిర్వాహకులు రవిప్రకాశ్, తిరుపతయ్య, అహ్మద్, యాదగిరి, బాలరాజు ఉన్నారు.


