
వసతుల లేమితో కాన్పులు చేయలేకపోతున్నాం..
వెల్దండ: మండల కేంద్రంలో తాత్కాలికంగా కొనసాగుతున్న పీహెచ్‌సీ భవనంలో వసతులు సరిగా లేకపోవడంతో కాన్పులు చేయలేకపోతున్నామని వైద్యులు డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మికి వివరించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని బుధవారం డీఎంహెచ్‌ఓ పరిశీలించారు. పీహెచ్‌సీ భవనం శిథిలావస్థ చేరడంతో మరమ్మతు కోసం ప్రభుత్వం రూ.40లక్షలు కేటాయించడంతో పనులను ఆమె పరిశీలించారు. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించి నాలుగేళ్లు అవుతున్నా.. పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు, ఆశాకార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ లక్ష్మణ్, డాక్టర్ సింధు, మురళీకృష్ణ, తదితరులు ఉన్నారు.