
రేపు స్పాట్ అడ్మిషన్లు
బిజినేపల్లి/ పెద్దకొత్తపల్లి/ వెల్దండ/ తెలకపల్లి: జిల్లాలోని బిజినేపల్లి, పెద్దకొత్తపల్లి, వెల్దండ, తెలకపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి గురువారం స్పాట్ అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు సుమతి, అకుల్, స్వర్ణరత్నం, లక్ష్మి మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఇస్తామన్నారు. గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆయా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాలలో పేరు నమోదు చేసుకొని అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో వచ్చి స్పాట్ అడ్మిషన్ పొందాలని సూచించారు.
శాంతిభద్రతలపరిరక్షణకే కార్డెన్ సెర్చ్
అచ్చంపేట రూరల్: శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలోని ఇంద్రానగర్‌కాలనీలో కార్డెన్‌సెర్చ్ చేపట్టి.. 71 వాహనాలు సీజ్ చేశామని, ఇందులో 19 వాహనాలు నంబర్ ప్లేట్లు కూడా లేవన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సైబర్ మోసాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నివారణ అందరి బాధ్యత అన్నారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సీఐలు నాగరాజు, శంకర్, ఎస్‌ఐలు విజయభాస్కర్, వెంకట్‌రెడ్డి, గిరిమనోహర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.