
గ్రామాల్లో ఫీవర్ సర్వే చేపట్టాలి : డీఎంహెచ్‌ఓ
బిజినేపల్లి: జ్వరం కేసులు ఎక్కువగా నమోదైన గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేయాలని, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. మంగళవారం మండలంలోని పాలెం పీహెచ్‌సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, ముందుల నిల్వల గది, ల్యాబ్‌ను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి సహకారంతో దోమల పెరుగుదలను అరికట్టాలని, నీరు నిల్వ లేకుండా చేయాలని, అవసరమైన చోట ఆయిల్ బాల్స్ వేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని, ఇందుకు ఇతర శాఖల సహకారం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా టీకా నియంత్రణ అధికారి రవికుమార్, వైద్యాధికారి ప్రియాంక, డీపీఓ రేణయ్య, ఎంపీహెచ్‌ఐఓ రాజేష్, ఎల్సిదాయా తదితరులు పాల్గొన్నారు.
నవోదయ దరఖాస్తు గడువు పొడిగింపు
బిజినేపల్లి: వట్టెం నవోదయ విద్యాలయంలో 2026– 27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువు మంగళవారంతో ముగియనుండగా దానిని ఆగస్టు 13వ తేదీ వరకు పొడిగించినట్లు విద్యాలయ ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆగస్టు 13లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
చెంచులకు అందుబాటులో పోస్టల్ సేవలు
మన్ననూర్: నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని ఆదివాసీ చెంచులకు పోస్టల్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తుందని వనపర్తి డివిజన్ తపాలా పర్యవేక్షకులు భూమన్న తెలిపారు. మంగళవారం నల్లమల అటవీ ప్రాంతంలోని అప్పాపూర్, భౌరాపూర్, రాంపూర్, పుల్లాయిపల్లి, ఈర్లపెంట, మేడిమల్కల తదితర పెంటలను సందర్శించిన అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అటవీ ప్రాంతంలో ఉన్న చెంచులకు పోస్టల్ సేవలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో విచారణ కోసం పంపించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతంలో సుమారు 3 వేల జనాభా కు ఒక బ్రాంచ్ ఆఫీస్ కొనసాగించడానికి అవ కాశం ఉంటుందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేకించి చెంచు గ్రామాలు, పెంటలు, గూడేలలో 1,500 జనాభా ఉంటే బ్రాంచ్ ఆఫీస్ కొనసాగించే అవకాశం ఉన్నందున ఈ పెంటలను పరిశీలించామని చెప్పారు. ఈ క్రమంలో లోతట్టు పెంటలను కలుపుకొని అప్పాపూర్‌లో బ్రాంచ్ పోస్టాఫీసు ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీహెచ్ రవికుమార్, బీపీఎం నిరంజన్, మాజీ సర్పంచ్ బాలగురువయ్య, జానకిరాం, చెంచు యువకులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో ఫీవర్ సర్వే చేపట్టాలి : డీఎంహెచ్‌ఓ