భక్తిశ్రద్ధలతో ఈద్–ఉల్–ఫితర్
కందనూలు: జిల్లావ్యాప్తంగా సోమవారం ఈద్–ఉల్–ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద జామా మసీదు ఫాహి ఇమామ్ అబ్ధుల్ హక్ ప్రత్యేక ప్రార్ధనలు చేయించారు. ఈ సందర్భంగా రంజాన్ ప్రాముఖ్యతను వివరించారు. మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో అందరూ పయనించాలని ఆయన సూచించారు. కాగా, కొల్లాపూర్‌లోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలకు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, కల్వకుర్తిలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు వివిధ పార్టీల నాయకులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
● జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కూచుకుళ్ల మాట్లాడుతూ.. ఇస్లాం మతానికి మూల స్తంభాలైన ఈమాన్ నమాజ్ రోజా జకాత్ హజ్ సూత్రాలను ముస్లింలు పాటిస్తూ సోదరభావంతో ముందుకు సాగడం హర్షనీయమన్నారు. ప్రతి ఒక్కరూ బలహీనతలు, వ్యసనాలను జయించి మత గురువుల ప్రబోధాలను ఆచరించాలని అన్నారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలతో పాటు కౌన్సిలర్లు సునేంద్ర, జక్కరాజు, బచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
మసీదులు, ఈద్గాల్లో ముస్లింల
ప్రత్యేక ప్రార్థనలు
భక్తిశ్రద్ధలతో ఈద్–ఉల్–ఫితర్


