నాగర్‌కర్నూల్ క్రైం: నవజాత శిశువుల్లో అంధత్వాన్ని నివారించేందుకు దృష్టిలోపాలను గుర్తించాలని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో హైదరాబాద్ పుష్పగిరి కంటి ఆస్పత్రి వారి సహకారంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నవజాత శిశువుల్లో కలిగే అంధత్వంపై చిన్నపిల్లల వైద్యులు, స్టాఫ్‌నర్సులు, నేత్రాధికారులకు పునశ్చరణ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవజాత శిశువుల్లో కలిగే దృష్టి లోపాలను వెంటనే గుర్తించి, తగిన చికిత్స చేయాలన్నారు. రెటినోపతి సమస్య 37 వారాల కంటే ముందే ప్రసవించిన శిశువులు, శిశువు బరువు రెండు కిలోల కన్నా తక్కువ ఉన్న వారిలో ఏర్పడుతుందన్నారు. పిల్లల్లో రెటినోపతి సమస్యను వెంటనే గుర్తించి తగిన చికిత్స చేయడం వల్ల అంధత్వాన్ని నివారించవచ్చన్నారు. పుష్పగిరి కంటి ఆసుపత్రి రెటీనా స్పెషలిస్ట్ డాక్టర్ సాయికిరణ్మయి మాట్లాడుతూ రెటినోపతి లోపం ఉన్న శిశువులకు మందులు, లేజర్ చికిత్స ద్వారా చాలా సులభంగా నయం చేయవచ్చని పేర్కొన్నారు. డాక్టర్ బాల మాట్లాడుతూ ప్రతినెలకు ఒకసారి నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రెటినోపతి సమస్య ఉన్న శిశువుల కోసం ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శిశువుల్లో అంధత్వాన్ని నివారించడంలో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి రవికుమార్, చిన్నపిల్లల వైద్యులు ఉమాదేవి, ప్రశాంత్, పాండురంగ, ఆర్‌బీఎస్‌కే వైద్యులు, నేత్రాధికారులు వెంకటస్వామి, వెంకటేష్, బాలాజీ, ఎంపీహెచ్‌ఈఓ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


