పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి

Apr 17 2026 10:26 AM | Updated on Apr 17 2026 10:26 AM

ములుగు రూరల్‌: ప్రభుత్వ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ టీఎస్‌.దివాకర అధికారులకు సూచించారు. మల్లంపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు అందించిన విధంగా ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు మధ్యాహ్నా భోజనం పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. దివ్యాంగులైన విద్యార్థులకు మోటరైజ్డ్‌ వాహనాలు అందించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విద్య, సామాజిక భద్రత, మహిళల ఆర్థికాభివృద్ధి వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని వివరించారు. నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రైతులు వరి సాగుపై ఆధారపడకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటల వైపు మొగ్గు చూపాలన్నారు. ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ రూ.40 వేలు అందిస్తుందని వివరించారు. ఇంచర్ల వద్ద ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ నిర్మాణ దశలో ఉందని తెలిపారు. దీంతో 300 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని వెల్లడించారు. మల్లంపల్లి మండల కేంద్రంలో నూతన మార్కెట్‌ యార్డు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, పలు అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీఆర్‌డీఓ కృపాకర్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఎంపీఓ, తహసీల్దార్‌, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ టీఎస్‌.దివాకర

Advertisement
 
Advertisement
Advertisement