
ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ములుగు రూరల్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజల ఆరోగ్యంపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం కలెక్టర్ దివాకరతో కలిసి వైద్యాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఏజెన్సీ గ్రామాలలో వైద్యశిబిరాలు నిర్వహించి గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల సమయంలో వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందుల నిల్వలను ఉంచుకోవాలన్నారు. గ్రామాల్లో దోమలు వృద్ధి చెందకుండా ఫాగింగ్ చేయించాలని వెల్లడించారు. గతేడాది పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గురుకుల, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో విద్యార్థులకు వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణకుమారి, డీసీహెచ్ జగదీశ్, తదితరులు పాల్గొన్నారు.
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా
నాగమణి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోవిందరావుపేటకు చెందిన మద్దాలి నాగమణిని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా నియమించారు. డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తకు తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందన్నారు. దానికి నిదర్శనం మద్దాలి నాగమణి అన్నారు. చిత్తశుద్ధితో పని చేస్తే ఉన్నత పదవులు తప్పక లభిస్తాయన్నారు. నూతనంగా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికై న నాగమణి మంత్రి సీతక్కకు అభినందనలు తెలిపారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ
మంత్రి సీతక్క

ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి