
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
ములుగు రూరల్: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నాగయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికి వదిలేసి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలను ఇచ్చిందని, ఫ్రీ బస్సు పథకం తప్ప మిగిలిన ఏ హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతురుణమాఫీ, దళితబంధు, పోడు భూములకు పట్టాలు, నిరుద్యోగ భృతి లాంటి హామీలు అమలు చేయలేకపోతుందన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దావూద్, రఘుపతి, గ్యానం వాసు, కృష్ణబాబు, రమేష్, రత్నం ప్రవీణ్, హుస్సేన్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
నాగయ్య