
పింఛన్.. టెన్షన్
ఏటూరునాగారం: వేలిముద్రలు పడితే ఆసరా పింఛన్ ఇవ్వాలనేది గతంలో ప్రభుత్వ నిబంధన. అయితే చాలామంది లబ్ధిదారులు.. ప్రధానంగా వృద్ధులు వేలిముద్రలు చెరిగిపోవడంతో పింఛన్ తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొనేవారు.. దీంతో ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌ఏల వేలిముద్రలతో పింఛన్ డ్రా చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు వేలిముద్రలు పడని వృద్ధులకు ఐరిస్ స్కానింగ్‌తో పింఛన్ ఇచ్చే నిబంధనను జూలై 26 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఐరిస్ ఉంటేనే ఆసరా పింఛన్ అని అధికారులు చెబుతుండడంతో పోస్టాఫీసుల వద్ద లబ్ధిదారులు పడిగాపులు పడుతున్నారు. ఇటు వేలిముద్రలు లేక, అటు ఐరిస్ రాకపోవడంతో పింఛన్ పోతుందో ఏమో అని వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. పోస్టాఫీసుల అధికారులకు పూర్తి అధికారులు ఇచ్చి యాప్ ద్వారానే ఐరిస్ స్కానింగ్ చేసి పింఛన్ ఇవ్వాలని ఆదేశించడంతో వృద్ధులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా కేవలం నాలుగు రోజుల సమయంలోనే పూర్తి స్థాయిలో పింఛన్ ఇవ్వాలని డెడ్‌లైన్ విధించడంతో పింఛన్లు పంపిణీ చేసే క్రమంలో తీవ్ర జాప్యం అవుతుంది. దాంతో కాలం ముగిసిందని, పింఛన్ ఈ నెల కాదు వచ్చే నెల తీసుకోవాలని పోస్టాఫీసు సిబ్బంది చెప్పడంతో లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు. లబ్ధిదారులు ఎక్కువ సంఖ్యలో ఉండడం.. పంపిణీ చేసే సిబ్బంది తక్కువగా ఉండడంతో చాలాచోట్ల సమయం మించి పోతుంది. దీంతో లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడంలేదు.
పారదర్శకతో అసలుకు ఎసరు..
ఆసరా పింఛన్‌లో అక్రమాలు జరుగుతున్నాయని అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వాలని ఐరిస్‌ను అమల్లోకి తెచ్చారు. కానీ అర్హులైన ఆసరా లబ్ధిదారులకు సైతం వేలిముద్ర, ఐరిస్ క్యాప్చరింగ్ కాక పింఛన్ కోల్పోయే పరిస్థితి నెలకొంది. గత నెల తీసుకోని లబ్ధిదారులకు రెండు నెలల పింఛన్ అందాల్సి ఉండగా ఇప్పుడు కంటి ఐరిస్ పడక ఆ పింఛన్ పోతుందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోకపోతే ఆటోమెటిక్‌గా లబ్ధిదారుడి పింఛన్‌ను తొలగించే నిబంధనలు ఉండడం గమనార్హం.
పింఛన్ పొందేందుకు ఐరిస్ నిబంధన
అవస్థలు పడుతున్న
కంటిచూపు మందగించిన వృద్ధులు
పోస్టాఫీసుల వద్ద పడిగాపులు
సాంకేతిక సమస్యతో అందని ఆసరా

పింఛన్.. టెన్షన్