
వరదలు.. వలసలు
సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న కొండాయి గ్రామస్తులు
ఏటూరునాగారం: ముంచుకొస్తున్న వరదలతో ఎవరి ప్రాణాల పోతాయోనని భయంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని కొండాయి ప్రజలు వాగు దాటి వలసబాట పట్టారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవడానికి సిద్ధమయ్యారు. ఏటూరునాగారం మండలంలోని పూర్తిగా ముంపు ప్రాంతమైన కొండాయి ప్రజల దీనగాథ ఇది..
గత ఇరవై ఏళ్ల నాటి కష్టాలు మళ్లీ వచ్చాయని కొండాయి ప్రజలు గొల్లుమన్నారు. 2023 సంవత్సరంలో ఇదే వర్షాకాలంలో జూలై 27న జంపన్న వాగు ఉగ్రరూపానికి వాగుపై ఉన్న వంతెన నామరూపాలు లేకుండా కొట్టుకుపోయి గ్రామాన్ని ముంచెత్తింది. ఎనిమిది మంది ప్రాణాలు జంపన్న వాగు బలి తీసుకుంది. ఇళ్లన్నీ మునిగి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. అయితే మళ్లీ ఈ ఏడాది కూడా వర్షాలు వస్తాయనే భయంతో కొండాయిలోని 28 దళిత కుటుంబాలు దొడ్ల, కొత్తూరు అటవీ ప్రాంతాలకు వలసబాట పట్టారు.
అడవిలో గుడిసెలు
రెండు రోజులుగా కొండాయి నుంచి దొడ్ల, కొత్తూరు అటవి ప్రాంతానికి మూటలను పట్టుకుని వలసవెళ్లిన ప్రజలు గుడిసెలు వేసుకున్నారు. దీంతో అటవీశాఖ అధికారులు అనుమతి లేనిది గుడిసెలు వేయొద్దని ఆదేశించారు. ఇదే విషయాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి సీతక్క తెలుసుకొని భయ పడాల్సిన అవసరం లేదని, ముంపు ప్రాంతాల ప్రజలకు స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో అడవిని వీడి వారి ఇళ్లకు వెనుదిగారు.
పక్కా ఇళ్లు కట్టివ్వాలని డిమాండ్
మంత్రి సీతక్క హామీతో
వెనుదిరిగిన ప్రజలు

వరదలు.. వలసలు