దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలి
● ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా
ఏటూరునాగారం: గిరిజన దర్బార్‌లో పలు సమస్యలపై గిరిజనులు అందజేసిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం చూపాలని సెక్టార్ అధికారులను పీఓ చిత్రామిశ్రా ఆదేశించారు. మండల కేంద్రంలోని ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో పీఓ వినతులను స్వీకరించారు. మంగపేట మండలం నిమ్మగూడెంకు చెందిన ఓ గిరిజనుడు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని వినతి పత్రాన్ని సమర్పించారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో డిప్యుటేషన్‌పై వేరే పాఠశాలకు పంపించాలని ఓ ఉపాధ్యాయుడు కోరారు. ఏటూరునాగారం మండలంలోని ఆకులవారిఘణపురం ఐటీఐ, వాజేడు ఐటీఐల నుంచి ఫిట్టర్ ఉద్యోగం అవకాశం కల్పించాలని నిరుద్యోగి విన్నవించారు. మండలంలోని శంకరాజుపల్లి గ్రామంలో ఐటీడీఏ ద్వారా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఇవ్వాలని గిరిజనులు వేడుకున్నారు. వెంకటాపురం(కె) మండలంలోని సీహెచ్‌సీ ఆస్పత్రిలో పలు సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాలని ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్‌కుమార్, మేనేజర్ శ్రీనివాస్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్‌మోహన్‌రెడ్డి, జీసీసీ డీఎం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.


