మేడారంలో నేడు మంత్రుల పర్యటన
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో నేడు (మంగళవారం) రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్కలు పర్యటించనున్నారు. సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి, జాతర పనులను పరిశీలించనున్నారు. అనంతరం జాతర అభివృద్ధి పనుల ఏర్పాట్లపై అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ఏటూరునాగారం: గిరిజన నిరుద్యోగ అభ్యర్థులకు జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్(జెడ్‌ఎస్‌టీఎస్) తెలంగాణ రోడ్డు ట్రాన్స్‌ఫోర్ట్ కార్పొరేషన్ ద్వారా ములుగు రోడ్డు వద్ద హెవీ మోటార్ వెహికల్, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణతో పాటు ఉచిత భోజనం, వసతి కల్పించనున్నట్లు ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హెవీ మోటార్ శిక్షణకు 30 రోజులు, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ 21 రోజుల పాటు ఉంటుందని వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 31 సాయంత్రం 5 గంటల వరకు ఐటీడీఏ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
గోవిందరావుపేట: దివంగత పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి జి. వెంకటస్వామి వర్థంతిని పురస్కరించుకుని సోమవారం మండల పరిధిలోని చల్వాయి టీజీఎస్పీ 5వ బెటాలియన్ కార్యాలయంలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. కమాండెంట్ సుబ్రహ్మణ్యం వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా వెంకటస్వామి చేసిన సేవలు చిరస్మరణీయమని, ప్రజాసేవకు ఆయన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. సామాన్యుల సమస్యలను పార్లమెంట్‌లో ధైర్యంగా ప్రస్తావించిన ఆయన ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ సీతారామ్, అసిస్టెంట్ కమాండెంట్లు అనిల్, శ్రీనివాసరావు, వేణుగోపాల్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, బెటాలియన్ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: విద్యారంగంలో ఎన్జీవోల జోక్యం ఆందోళనకరంగా మారందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సొమవారం నిర్వహించిన జిల్లా విస్తృత సమావేశానికి సమ్మారావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యారంగంలో ఎన్జీవోల పాత్ర గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోందని, పరోక్షంగా ప్రైవేటీకరణకు దారులు వేసే ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ నెల 28, 29 తేదీల్లో జనగామ జిల్లాలో జరిగే టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు, విస్తృత సమావేశాల వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నక్క తిరుపతి, కొత్త కుమారస్వామి, నాయకులు రాజేందర్, శ్రీధర్, రమేశ్, రఫీపాషా, రమాదేవి, రామయ్య పాల్గొన్నారు.
భూపాలపల్లి: భారీ వర్షాలు కురిసి వాగులు ఉప్పొంగి, చెరువు కట్టలు తెగినప్పడు ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు ఎలా చేరుకోవాలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కళ్లకు కట్టినట్లుగా చూపించారు. 2023 జూలై 27న భూపాలపల్లి మండలంలోని మోరంచవాగు ఉప్పొంగి మోరంచపల్లిలో 280 ఇళ్లు నీట మునిగాయి. గ్రామానికి చెందిన నలుగురు వరదలో కొట్టుకుపోయి మృతి చెందారు. ఈ నేపథ్యంలో మరోమారు ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు ప్రాణనష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సోమవారం మోరంచపల్లి గ్రామంతో పాటు, మోరంచవాగులో మాక్ డ్రిల్ నిర్వహించాయి. వాగులు ఉప్పొంగినప్పుడు పశువులు, మనుషులు నీటిలో కొట్టుకుపోతే, ఎలా కాపాడాలో కళ్లకు కట్టినట్లుగా డ్రిల్ నిర్వహించారు. అధికార యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచించారు. వరద ప్రభావిత కాలనీలను ఎలా తరలించాలో తెలియజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మేడారంలో నేడు మంత్రుల పర్యటన


