వాజేడు: మంద కృష్ణమాదిగ పద్మశ్రీ అవార్డు అందుకుని ఢిల్లీ నుంచి ఈనెల 31న వరంగల్‌కు వస్తున్నందున స్వాగతం పలికేందుకు నిర్వహించ తలపెట్టిన చలో వరంగల్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి, ములుగు జిల్లా ఇన్‌చార్జ్ దుడ్డు రామకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి ముర్ము నుంచి పద్మశ్రీ అవార్డు అందుకుని వరంగల్‌కు వస్తున్న మంద కృష్ణకు స్వాగతం పలకడంతో పాటు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మాదిగ, మాదిగ ఉపకుల సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మడిపల్లి శ్యాంబాబు, పుల్లూరి కరుణాకర్, చెన్నం స్వామి, సమ్మయ్య, ప్రశాంత్, సర్వేశ్, నాని, రాము తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
ములుగు: ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్(టీడబ్ల్యూజేఏ) రెండో రాష్ట్ర మహాసభ పోస్టర్‌ను బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఎలాంటి సమస్యలు లేకుండా సభను విజయవంతం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు సీతక్కకు ఆహ్వాన పత్రికను అందించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, టీడబ్ల్యూజేఏ జిల్లా అధ్యక్షుడు వెంకన్న, గౌరవ అధ్యక్షుడు భూక్య సునీల్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు ఎండీ షఫీ అహ్మద్, సంజీవ తదితరులు పాల్గొన్నారు.
బొగ్గు ఉత్పత్తిని పెంచాలి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో ఓపెన్‌కాస్టులో బొగ్గు ఉత్పత్తిని పెంచాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఏరియాలోని కేటీకే ఓసీ–2లో నూతనంగా కొనుగొలు చేసిన షావల్ వాహనాన్ని బుధవారం జీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ రూ.1.71కోట్లతో కొనుగోలు చేసిన వాహనానికి సరస్వతి అని నామకరణం చేసినట్లు తెలిపారు. ఈ షావల్ యంత్రం లేకపోవడంతో గంటకు రూ.7వేల నష్టం సింగరేణికి వాటిల్లుతుందన్నారు. దీంతో బొగ్గు ఉత్పత్తి చేసి ముందంజలో ఉండాలని సూచించారు. ఉద్యోగులకు కేటాయించిన 8 గంటల పనిని తప్పనిసరిగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, ఏర్రన్న, ప్రసాద్, వెంకటరమణ, భిక్షమయ్య, రాజరావు, కిష్టయ్య, నజీర్, కార్మిక సంఘాల నాయకులు రమేష్, మధుకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోటను సందర్శించిన మాల్దీవ్స్ దేశస్తులు
ఖిలా వరంగల్: కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోటను బుధవారం మాల్దీవ్స్ దేశస్తులు సందర్శించారు. నాలుగు కీర్తితోరణాల నడుమ నళ్ల రాతిలో నాటి శిల్పులు చెక్కిన శిల్పకళ సంపదను తిలకించారు. అనంతరం రాతి, మట్టికోట అందాలు, ఖుష్‌మహల్‌ను సందర్శించి కాకతీయుల కళాఖండాలను తమ వెంట తెచ్చుకున్న కెమెరాలలో బంధించుకున్నారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను కోట గైడ్ రవి వివరించారు. వారివెంట కేంద్రపురావస్తుశాఖ కోఆర్డినేటర్ శ్రీకాంత్, టీఎస్‌టీడీసీ కోట ఇన్‌చార్జ్ అజయ్ పాల్గొన్నారు.
క్రైం ఏసీపీగా సదయ్య
హసన్‌పర్తి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైం ఏసీపీగా సదయ్య నియమితులయ్యారు. సీఐడీ విభాగంలో పనిచేసిన సదయ్య బదిలీపై ఇక్కడికిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. గతంలోని ఆత్మకూర్‌లో ఎస్సైగా, కేయూసీ, సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించారు.
‘చలో వరంగల్‌ను జయప్రదం చేయాలి’


