ములుగు రూరల్: సమస్యల పరిష్కారానికి బీసీలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డెపల్లి రఘుపతి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌లో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కార్పొరేషన్‌లో నిరుపేదలు సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు చేసుకున్నా ప్రభుత్వం మంజూరు చేయడం లేదని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా 5,700 మంది దరఖాస్తులు చేసుకొని రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌లను 34శాతం నుంచి 22 శాతానికి తగ్గించారన్నారు. బీసీలకు రాజకీయాల్లో 58 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈబీఎస్ నిధుల కోటను పెంచాలన్నారు. అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నూతన కన్వీనర్‌గా బట్టు మురళీకృష్ణను జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య నియమించగా నియామక పత్రాన్ని రఘుపతి అందజేసి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానించారు. అనంతరం మురళీకృష్ణ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య, జాతీయ కన్వీనర్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి కోల జనార్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొనగాని యాదగిరిగౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Feb 26 2023 10:10 AM | Updated on Feb 27 2023 6:45 PM
Advertisement
Advertisement