డీసీసీ అధ్యక్షుడు నల్లెల కన్నుమూత

మృతదేహంపై పడి బోరున విలపిస్తున్న ఎమ్మెల్యే సీతక్క - Sakshi

ములుగు: రెండేళ్లుగా గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతున్న కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి(61) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని చూసేందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు, బంధుమిత్రులు ములుగు జిల్లాతో పాటు మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, నర్సంపేట, మహబూబాబాద్‌, మంథని నియోజకవర్గాల నుంచి భారీగా తరలివచ్చారు. నివాళి అర్పించిన ఎమ్మెల్యే సీతక్క మృతదేహంపై పడి బోరున విలపించారు. అశ్రునయనాల మధ్య మధ్యాహ్నం 3:30 గంటలకు శోభాయాత్ర ప్రారంభమై మూడు గంటల పాటు సాగింది. సీతక్క పాడెమోశారు. శోభాయాత్రలో ప్రజలు భారీగా హాజరయ్యారు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో జిల్లాకేంద్రంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

బోరున విలపించిన సీతక్క

నల్లెల మరణవార్త తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సీతక్క హుటాహుటిన ములుగుకు చేరుకున్నారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. నల్లెల మృతి కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటన్నారు. కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపి అన్నీ తానై దగ్గరుండి ఏర్పాట్లు చూశారు.

పలువురు నివాళి..

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వీరమల్ల ప్రకాశ్‌ నివాళ్లర్పించారు. బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్‌తో కలిసి స్వరాష్ట్ర ఉద్యమంలో చేసిన అలుపెరగని పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన లేని లోటు తీరనిదన్నారు. మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్‌, కాంగ్రెస్‌ నేతలు గండ్ర సత్యనారాయణరావు, వేం నరేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి, సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమా, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నివాళ్లర్పించారు.

దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన రేవంత్‌రెడ్డి

నల్లెల కుమారస్వామి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నల్లెల మరణవార్తను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ ఆవేదన వ్యక్తంచేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

నల్లెల రాజకీయ ప్రస్థానం

నల్లెల కుమారస్వామి 1986లో టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేశారు. 1988లో తొలిసారిగా సర్పంచ్‌గా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. 1994లో తెలుగుదేశం తరఫున తొలిసారి సర్పంచ్‌గా గెలిచారు. 2001లో టీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరి ములుగు మండలం పందికుంట ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా ఎన్నికయ్యారు. 2010లో కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. తెలంగాణ ఉద్యమంతో పాటు ములుగు జిల్లా ఏర్పాటు సమయంలో అలుపెరగని ఉద్యమం చేశారు. 2017లో ములుగు ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు అయినప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.

బోరున విలపించిన ఎమ్మెల్యే సీతక్క

భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, మిత్రులు

తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక

Read latest Mulugu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top