Bappi Lahiri Death: ప్రముఖ గాయకుడు బప్పి లహిరి కన్నుమూత

Veteran Singer Composer Bappi Lahiri Passes Away in Mumbai - Sakshi

ముంబై: ప్రముఖ గాయకుడు, బాలీవుడ్‌ సంగీత దిగ్గజం బప్పి లహిరి కన్నుమూశారు. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 69 ఏళ్లు. 1952 నవంబర్‌ 27న బెంగాల్‌లో జన్మించిన బప్పి.. సంగీతంలో తన విభిన్న శైలితో చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగులో సింహాసనం, స్టేట్‌ రౌడీ, సామ్రాట్‌, గ్యాంగ్‌ లీడర్‌, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్‌ చిత్రాలకు సంగీతం అందించారు. తెలుగులో చివరిగా డిస్కో రాజా చిత్రంలో పాటపాడారు. కాగా 2014లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. బప్పీ లహరి మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

బప్పి లహరి 70వ దశకంలో బాలీవుడ్‌కు డిస్కో, రాక్ సంగీతాన్ని పరిచయం చేశారు. మిథున్‌ చక్రవర్తికి డిస్కో డ్యాన్సర్‌ పాటతో లైఫ్‌ ఇచ్చిన బప్పి లహరి.. డిస్కో కింగ్‌గా గుర్తింపు పొందారు. నిత్యం బంగారు ఆభరణాలు ధరించి కనిపించే సంగీత విద్వాంసుడిగా ఆయనకు మరో గుర్తింపు కూడా ఉంది. లహరి తన సినీ ప్రయాణంలో వార్దత్, డిస్కో డాన్సర్, నమక్ హలాల్, డ్యాన్స్ డ్యాన్స్, కమాండో, సాహెబ్, గ్యాంగ్ లీడర్, సైలాబ్, షరాబి వంటి హిట్ సాంగ్స్‌ను అందించి సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు. తాహిర్ హుస్సేన్ చిత్రం ‘జఖ్మీ’ (1975)తో బాలీవుడ్‌లోకి ప్రవేశించాడు. ఆ తరువాత ఆయన ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా మారాడు. ఇక సంగీత దిగ్గజాలు మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్, లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, విజయ్ బెనెడిక్ట్, షారన్ ప్రభాకర్, అలీషా చినాయ్, ఉషా ఉతుప్ వంటి తరతరాల గాయకులతో కలిసి చేశాడు.

చదవండి: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు దీప్‌ సిద్ధూ మృతి 

లెజెండరీ సింగర్‌ కిశోర్‌ కుమార్‌కు బప్పిదా బంధువు. హిందీతోపాటు తెలుగు, తమిళ్‌, కన్నడ, గుజరాతీ భాషల్లో బప్పి లహిరి సంగీతం అందించారు. ఇక తెలుగు ప్రేక్షకులనూ ఆయన సంగీతంలో ఓలలాడించారు. సింహాసనం (1986), తేనే మనసులు (1987), త్రిమూర్తులు, శంఖారావం, సామ్రాట్, కలెక్టర్ విజయ (1988), మన్మధ సామ్రాజ్యం, స్టేట్ రౌడీ (1989), చిన్నా (1990), చిన్న కోడలు, ఇంద్ర భవనం (1991), గ్యాంగ్ లీడర్, రౌడీ గారి పెళ్ళాం, రౌడీ అల్లుడు, దొంగ పోలీస్ (1992), రక్త తర్పణం, రౌడీ ఇన్‌స్పెక్టర్, బ్రహ్మ, నిప్పు రవ్వ (1993), రౌడీ రాజకీయం, పెద్ద యజమాని (1995), ముద్దాయి ముద్దుగుమ్మ, ఖైదీ ఇన్‌స్పెక్టర్, పుణ్య భూమి నా దేశం వంటి తెలుగు చిత్రాలకు బప్పి లహరి సంగీతం అందించారు. తెలుగులో చివరగా రవితేజ “డిస్కో రాజా” సినిమాలోని “ఫ్రీక్ అవుట్” పాటలను పాడారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top