
కొన్నాళ్ల క్రితం థియేటర్లలో రిలీజైన 'మహావతార్ నరసింహా' అనే యానిమేషన్ సినిమా సంచలనం సృష్టించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ పెడితే ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతోంది. రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి రికార్డ్స్ కొల్లగొడుతోంది. ఇప్పుడు దీన్ని స్పూర్తిగా తీసుకున్నారో ఏమో గానీ తెలుగులోనూ ఓ మూవీ తీసేందుకు సిద్ధమైపోయారు. తాజాగా ఆ వివరాల్ని అధికారికంగా ప్రకటించారు.
(ఇదీ చదవండి: హిజ్రాగా నటించాలి.. ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఆశ)
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తన కొత్త మూవీని ప్రకటించింది. హనుమంతుడి జీవితం ఆధారంగా 'వాయుపుత్ర' పేరుతో ఈ త్రీడీ యానిమేషన్ సినిమాని తీస్తున్నారు. 'కార్తికేయ', 'కార్తికేయ 2', 'తండేల్' లాంటి హిట్ చిత్రాలు తీసిన చందు మొండేటి.. ఈ యానిమేషన్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది దసరాకు థియేటర్లలోకి తీసుకురానున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు.
నరసింహా అవతారం ఆధారంగా 'మహావతార్' మూవీ తీశారు. జనాల్ని భక్తి పారవశ్యం చెందేలా చేశారు. ఇప్పుడు 'వాయుపుత్ర' పోస్టర్ చూస్తుంటే హనుమంతుడి జీవితంలోని ముఖ్య ఘట్టాల్ని యానిమేషన్ రూపంలో చూపించబోతున్నారని అనిపిస్తుంది. ఈ ట్రెండ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో నటీనటుల్ని పక్కనబెట్టి ఇలా పురాణాల్లోని క్యారెక్టర్స్ ఆధారంగా యానిమేషన్ మూవీస్ మరిన్ని వస్తాయేమో అనే సందేహం కలుగుతోంది.
(ఇదీ చదవండి: నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ)
మన చరిత్ర, ఇతిహాసాలలో వాయుపుత్రుడు హనుమంతుడిది ప్రత్యేక స్థానం. సప్త చిరంజీవులలో ఒకరైన హనుమంతుడు.. తన బలం, భక్తితో కాలాన్ని అధిగమించిన శాశ్వత యోధుడు. అలాంటి గొప్ప యోధుడి కథతో 'వాయుపుత్ర' చిత్రం రూపొందుతోంది. ఇది పర్వతాలను కదిలించిన భక్తి కథ కూడా. ఇది తరాలను తీర్చిదిద్దిన, ప్రేరేపించిన హనుమంతుడి అచంచల విశ్వాసాన్ని సంగ్రహిస్తుంది. చందూ మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం.. భారీస్థాయిలో త్రీడీ యానిమేషన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. 2026 దసరాకు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. హనుమంతుడు కొండపై నిలబడి, దహనమవుతున్న లంకను చూస్తున్న శక్తివంతమైన పోస్టర్ ఆకట్టుకుంటోంది.
