
ఎన్ని సినిమాలు చేసినా సరే నటీనటులకు ఏదో ఒక డ్రీమ్ పాత్ర మిగిలే ఉంటుంది. అలా ప్రముఖ నటి శోభన కూడా ఓ పాత్ర పోషించేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పింది. తెలుగు, తమిళం, మలయాళం ఇలా పలు భాషల్లో హీరోయిన్‌గా చేసిన ఈమె.. గొప్ప నాట్య కళాకారిణి కూడా. నటించడం తగ్గించి భరతనాట్యం పైనే ఎక్కువ మక్కువ చూపిస్తోంది. అలా చైన్నెలో డ్యాన్స్ స్కూలు నిర్వహిస్తోంది. మరోవైపు అడపా దడపా చిత్రాల్లో నటిస్తున్నారు. అదీ తనకు నచ్చిన పాత్రలు అయితేనే.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 తొలివారం నామినేషన్స్.. మొత్తం 9 మంది!)
ఇటీవల మలయాళంలో మోహన్ లాల్‌కు జంటగా 'తుడరుమ్' మూవీలో శోభన లీడ్ రోల్ చేశారు. ఈ చిత్రం అద్భుతమైన హిట్ అయింది. శోభన నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓనం సందర్భంగా ఓ న్యూస్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో మాట్లాడుతూ.. తాను ఓ హిజ్రా పాత్రని పోషించాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయమై దర్శకులతోనూ మాట్లాడానని అన్నారు. కానీ వారు మాత్రం.. ప్రేక్షకులు మిమ్మల్ని ఆ పాత్రలో అంగీకరించరని తనతో చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు.
మమ్ముట్టి నటిస్తే స్వాగతించలేదా? అని సదరు దర్శకుల్ని తాను ప్రశ్నించినట్లు శోభన చెప్పారు. మలయాళ మెగాస్టార్ అయిన మమ్ముట్టి.. రీసెంట్‌గా 'కాదల్ ది కోర్' అనే సినిమా చేశారు. ఇందులో స్వలింగ సంపర్కుడిగా (హిజ్రా) నటించడం విశేషం. దీంతో హిజ్రా పాత్రలో నటించడానికి తాను ఎదురుచూస్తున్నట్లు శోభన పేర్కొన్నారు. ఆ తరహా పాత్రలో నటించడం చాలా కష్టమని చెప్పిన ఈమె.. అందుకు రూపురేఖలు, మాట్లాడే తీరు, గొంతు లాంటివి చాలా ముఖ్యమని అన్నారు అందువల్ల అలాంటి పాత్రలో నటించడం తనకు చాలా ఛాలెంజ్‌గా ఉంటుందని పేర్కొన్నారు. కాగా శోభనని హిజ్రాగా నటింపజేయడానికి ఏ దర్శకుడు ముందుకు వస్తారో చూడాలి?
(ఇదీ చదవండి: నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ)