
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎందుకంటే టాలీవుడ్‌లో సినిమాలు వస్తున్నాయి గానీ బాక్సాఫీస్ దగ్గర నిలబడట్లేదు. అయితే హిట్ లేదంటే డిజాస్టర్ అవుతున్నాయి. మరోవైపు మూవీ టీమ్ నుంచి ఎవరో ఒకరు షాకింగ్ ఛాలెంజులు చేయడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రీసెంట్‌గా నిర్మాత నాగవంశీ ఇలానే ఛాలెంజ్ చేసి ఎంత ట్రోలింగ్‌కి గురయ్యారో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా అలాంటి ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
కొన్ని నెలల క్రితం 'భైరవం'తో వచ్చిన బెల్లంకొండ.. ఫ్లాప్ చవిచూశాడు. ఇప్పుడు హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. సెప్టెంబరు 12న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జరుగుతున్నాయి. టీమ్ అంతా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంది. అయితే హీరో చేసిన కామెంట్స్ మాత్రం కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 తొలివారం నామినేషన్స్.. మొత్తం 9 మంది!)
'రెండున్నర గంటలపాటు ప్రేక్షకులు అన్నీ మరిచిపోయి సినిమాలో లీనమయ్యే సత్తా ఈ 'కిష్కింధపురి'కి ఉంది. మూవీ చూస్తున్నప్పుడు ప్రేక్షకులు తమ మొబైల్ పట్టుకోకపోతే చాలు మనం సక్సెస్ అయినట్లే. ఈ చిత్రం కూడా అలాంటిదే. సినిమా మొదలైన 10 నిమిషాల తర్వాత ఎవరైనా ప్రేక్షకులు తమ మొబైల్ బయటకు తీశారంటే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతా' అని బెల్లంకొండ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. మరి ఈ హీరో ఏం చేస్తాడో చూడాలి?
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన ఈ హారర్ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేయగా మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ బట్టి చూస్తే.. ఓ పాడుబడిన రేడియో స్టేషన్, అక్కడికి వెళ్లిన కొందరు ఔత్సాహికులు, కాసేపటికి దెయ్యం ఎంటర్, తర్వాత ఏమైంది? అనే కాన్సెప్ట్‌తో తీసిన మూవీలానే అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్నా.. ఇంత విషం ఇవ్వండి: హీరో దర్శన్)