
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర(Upendra ) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలన్నీ తెలుగులో రిలీజ్ అవ్వడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచినవి కూడా ఉన్నాయి. ఫలితం ఎలా ఉన్నా సరే ఆయన సినిమాల్లో ఏదో ఒక కొత్త పాయింట్ కచ్చితంగా ఉంటుంది. తొలి సినిమా ‘ఏ’ నుంచే ఆయన ప్రయోగాలు ప్రారంభించాడు. అప్పటివరకు వచ్చిన చిత్రాలకు భిన్నంగా ‘ఏ’ సినిమా కథనం సాగుతుంది. అందుకే కన్నడతో పాటు తెలుగులోనూ ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఉపేంద్ర చాలా కష్టపడాల్సి వచ్చిందట.
సీనియర్ నటి సరోజా దేవి లేకపోతే ఆ సినిమానే రిలీజ్ అయ్యేది కాదని, ఇప్పుడు మీ కళ్ల ముందు ఇలా హీరోగా నేను ఉండేవాడినే కాదని ఆయన అన్నారు. శుక్రవారం బెంగుళూరులో జరిగిన దివంగత నటి సరోజా దేవి సంతాప సభలో ఉపేంద్ర మాట్లాడుతూ.. సరోజ వల్లే తాను హీరో అయ్యానని చెప్పాడు. ‘నేను దర్శకత్వం వహించి నటించిన తొలి సినిమా ‘ఏ’కి సెన్సార్ సమస్య వచ్చింది. ఇలాంటి సినిమాని రిలీజ్ చేయకూడదని చాలా మంది అన్నారు.
సెన్సార్ తిరస్కరించడంతో రివిజింగ్ కమిటీకి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో సరోజా దేవి నాకు తోడుగా నిలిచింది. సినిమా చూసిన తర్వాత నన్ను లోపలికి పిలిచారు. నేను వెళ్లగానే సరోజా దేవి లేచి నిలబడి చప్పట్లు కొడుతూ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఆమె కారణంగానే మా సినిమాకు సెన్సార్ పూర్తయింది. ఆమెను కలిసిన ప్రతిసారి ఈ విషయం గుర్తు చేసేవాడిని. ‘మీరే లేకపోతేను నేను హీరో అయ్యేవాడ్ని కాదు’ అని ఆమెకు చెప్పేవాడిని. రాజ్ కుమార్, విష్ణువర్థన్ మాత్రమే కాదు.. సరోజా దేవి పేరు మీద కూడా అవార్డులు ఇవ్వాలి. ఆమె రెండు సార్లు సెంట్రల్ జ్యూరీ మెంబర్‌గా కూడా పని చేశారు. ఆమె సాధించిన విజయాలు ఏంటో అందరికీ తెలుసు. వాటి గురించి మాట్లాడేంత వయసు నాకు లేదు’ అని అని ఉపేంద్ర అన్నారు.