విన్నారా... విన్నారా? | upcomming movie updates in tollywood: Telugu heroes listening to new stories | Sakshi
Sakshi News home page

విన్నారా... విన్నారా?

Oct 31 2025 4:49 AM | Updated on Oct 31 2025 4:49 AM

upcomming movie updates in tollywood: Telugu heroes listening to new stories

కొత్త కథలు వింటున్న తెలుగు హీరోలు 

కొత్త కాంబినేషన్స్‌పై ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఊహాగానాలు

ప్రతి వారం కొత్త సినిమాలు థియేటర్స్‌కు వస్తూనే ఉంటాయి. అలాగే హీరోలు కూడా ఎప్పటికప్పుడు తమ కొత్త ప్రాజెక్ట్స్‌ కోసం కథలు వింటూనే ఉంటారు. అయితే ప్రజెంట్‌ తమ కొత్త సినిమాల కోసం కథలు వింటున్న తెలుగు హీరోల సంఖ్య ఎక్కువగానే ఉంది. కథలు విన్నారనీ, ఇప్పటికే కొన్ని కొత్త సినిమాలకు సైన్‌ చేశారనీ కొంతమంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి... ఏ హీరో ఏయే దర్శకుల కథ విన్నారు? అనే విషయాలపై మీరూ ఓ లుక్‌ వేయండి.

జెట్‌ స్పీడ్‌తో... 
హీరో రవితేజ జెట్‌ స్పీడ్‌తో సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘మాస్‌ జాతర’ సినిమా నేటి (అక్టోబరు 31) నుంచి థియేటర్స్‌లో ప్రదర్శితమౌతోంది. అలాగే రవితేజ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఈ మూవీ తర్వాత ‘మ్యాడ్‌’ చిత్రాల ఫేమ్‌ కల్యాణ్‌ శంకర్‌తో రవితేజ సినిమా చేయాల్సి ఉంది.

ఈ చిత్రాలు ఇలా ఉండగానే... ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ట దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నారని, కథ విన్నారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో తెరపైకి వచ్చింది. అలాగే రైటర్‌ ప్రసన్న కుమార్‌ బెజవాడ కూడా రవితేజకు ఓ స్టోరీ లైన్‌  వినిపించారని, మరోసారి పూర్తి కథ విన్న తర్వాత ఈ సినిమాపై రవితేజ ఓ నిర్ణయానికి వస్తారని సమాచారం. అయితే ఈ విషయాలపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పవన్‌తో అనిల్‌ రావిపూడి? 
హీరో పవన్‌ కల్యాణ్, దర్శకుడు అనిల్‌ రావిపూడిల కాంబినేషన్‌లో ఓ సినిమాకి సన్నాహాలు మొదలవుతున్నాయనే టాక్‌ తెరపైకి వచ్చింది. ‘దిల్‌’ రాజు, ఈ సినిమాను నిర్మించనున్నారట. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమాపై ఓ క్లారిటీ రానుందని టాక్‌. అలాగే ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రోడక్షన్స్‌తో పవన్‌ కల్యాణ్‌ ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని భోగట్టా.

ఈ చిత్రానికి తమిళ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ‘రేసుగుర్రం, కిక్‌’ చిత్రాల ఫేమ్‌ దర్శకుడు సురేందర్‌ రెడ్డితో పవన్‌ కల్యాణ్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి... సురేందర్‌ రెడ్డితో సినిమాను పూర్తి చేసిన తర్వాత పవన్‌ కల్యాణ్‌ తన కొత్త సినిమాల చిత్రీకరణలను సెట్స్‌కు తీసుకువెళ్తారా? లేదా అనే అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ సినిమా చేస్తున్నారు పవన్‌ కల్యాణ్‌. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్‌ కానుంది.

తమిళ దర్శకుడితో...! 
‘పెద్ది’ సినిమాతో రామ్‌చరణ్‌ బిజీగా ఉన్నారు. ఇటీవల శ్రీలంకలో మొదలైన ఈ సినిమా కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసి గురువారం రామ్‌చరణ్‌ హైదరాబాద్‌ చేరుకున్నట్లుగా తెలిసింది. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రామ్‌చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా మార్చి 27న విడుదల  కానుంది. అయితే ఈ చిత్రం తర్వాత దర్శకుడు సుకుమార్‌తో రామ్‌చరణ్‌ సినిమా చేయాల్సి ఉంది.

మరోవైపు తమిళ దర్శకుడు ‘జైలర్‌’ ఫేమ్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్, హిందీ దర్శకుడు ‘కిల్‌’ ఫేమ్‌ నిఖిల్‌ నగేశ్‌ భట్‌ చెప్పిన స్టోరీలను కూడా రామ్‌చరణ్‌ విన్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది. అలాగే దర్శకులు త్రివిక్రమ్, సందీప్‌ రెడ్డి వంగాలతో కూడా రామ్‌చరణ్‌ సినిమాలు చేస్తారనే టాక్‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి... నెల్సన్‌తో రామ్‌చరణ్‌ సినిమా ఎప్పుడు సెట్స్‌కు వెళ్తుంది? అసలు... ఈ తమిళ దర్శకుడితో రామ్‌చరణ్‌ సినిమా ఉంటుందా? అనే అంశాలపై స్పష్టత రావడానికి మరింత సమయం పడుతుంది.

నాగచైతన్య 25 
నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ ఫేమ్‌ కార్తీక్‌ వర్మ దండు ఓ మిథికల్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ డ్రామాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇది నాగచైతన్య కెరీర్‌లోని 24వ సినిమా. కాగా, నాగచైతన్య కెరీర్‌లోని 25వ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలై పోయాయన్న టాక్‌ వినిపిస్తోంది. దర్శకులు కొరటాల శివ, బోయపాటి శ్రీను, శివ నిర్వాణ చెప్పిన కథలను హీరో నాగచైతన్య విన్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. మరి... నాగచైతన్య కెరీర్‌లోని ఈ 25వ సినిమాకు ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరో ఒకరు ఖరారు అవుతారా? లేక మరో దర్శకుడి పేరు ఏమైనా తెరపైకి వస్తుందా? అనేది   వేచి చూడాలి.

గ్రీన్‌ సిగ్నల్‌ 
గోపీచంద్‌తో ‘విశ్వం’ సినిమా చేసి, మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చారు దర్శకుడు శ్రీను వైట్ల. ఈ సినిమా తర్వాత తనదైన శైలిలో మరో ఎంటర్‌టైనింగ్‌ స్టోరీని శ్రీను వైట్ల సిద్ధం చేసుకున్నారని, ఈ కథను ఇటీవల శర్వానంద్‌కు వినిపించగా, ఈ హీరో ఆల్మోస్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందట. ఇక ప్రస్తుతం ‘బైకర్‌’, ‘భోగి’ సినిమాల చిత్రీకరణలతో శర్వానంద్‌ బిజీగా ఉన్నారు. అలాగే ఆల్రెడీ శర్వానంద్‌ హీరోగా నటించిన ‘నారి నారి నడుమ మురారి’ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఇలా వచ్చే ఏడాది మూడు సినిమాలతో శర్వానంద్‌ సందడి చేయనున్నారు.

స్పోర్ట్స్‌ డ్రామా 
‘రౌడీ జనార్ధన’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు హీరో విజయ్‌ దేవరకొండ. ఈ చిత్రం కోసం హీరోయిన్‌ కీర్తీ సురేశ్, విజయ్‌ దేవరకొండలపై మహారాష్ట్ర సరిహద్దుల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఈ చిత్రదర్శకుడు రవికిరణ్‌ కోలా. అయితే ఈ సినిమా తర్వాత తనకు ‘టాక్సీవాలా’తో సూపర్‌హిట్‌ అందించిన రాహుల్‌ సంకృత్యాన్‌తో ఓ పీరియాడికల్‌ వార్‌ డ్రామా కమిటయ్యారు విజయ్‌ దేవరకొండ. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.

అయితే రీసెంట్‌గా దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ ఓ స్పోర్ట్స్‌ డ్రామా స్టోరీని విజయ్‌ దేవరకొండకు వినిపించారని, ఈ కథ పట్ల విజయ్‌ కూడా సుముఖంగా ఉన్నారని, యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. మరి... ‘రౌడీ జనార్ధన’ తర్వాత విజయ్‌ దేవరకొండ.. రాహుల్‌ సంకృత్యాన్‌ సినిమాను స్టార్ట్‌ చేస్తారా? లేక విక్రమ్‌ కె. కుమార్‌ సినిమాను మొదలు పెడతారా? అనే అంశాలపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. దర్శకులు రాహుల్‌ సంకృత్యాన్, విక్రమ్‌ కె. కుమార్‌ల సినిమాలను విజయ్‌ ఒకేసారి సెట్స్‌కు తీసుకువెళ్లే అవకాశాలూ లేక పోలేదు.

ద్విపాత్రాభినయం 
‘తమ్ముడు’ సినిమా తర్వాత నితిన్‌ కొత్త చిత్రంపై ఇంకా సరైన స్పష్టత లేదు. దర్శకుడు శ్రీను వైట్ల, ‘బలగం’ ఫేమ్‌ దర్శకుడు వేణు యెల్దండి చెప్పిన కథలను నితిన్‌ విన్నారన్న వార్తలు వినిపించాయి. కానీ ఈ సినిమాలేవీ ఫైనలైజ్‌ కాలేదు. కాగా, ఇటీవల దర్శకుడు వీఐ ఆనంద్‌ ఓ సైన్స్‌ ఫిక్షన్‌ కథను సిద్ధం చేసుకుని, నితిన్‌కు వినిపించారట. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలకు కాస్త విభిన్నంగా ఉండటంతో ఈ కథ నచ్చి, నితిన్‌ ఈ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపారని సమాచారం. ఈ చిత్రంలో నితిన్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారని, ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారని, త్వరలోనే ఈ మూవీ గురించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

గ్రీన్‌ సిగ్నల్‌ 
ప్రస్తుతం ‘ఫంకీ’ సినిమాతో విశ్వక్‌ సేన్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘జాతి రత్నాలు’ ఫేమ్‌ కేవీ అనుదీప్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ డిసెంబరు చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా  తర్వాత తరుణ్‌ భాస్కర్‌తో ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా సీక్వెల్‌ను చేయనున్నారట. అలాగే శర్వానంద్‌తో ‘శ్రీకారం’ సినిమా తీసి, ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు కిశోర్‌ ఓ కథను సిద్ధం చేసి, విశ్వక్‌ సేన్‌కు వినిపించారని, ఈ సినిమాకు విశ్వక్‌ దాదాపు ఓకే చెప్పారని తెలిసింది. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. 

సుకుమార్‌ శిష్యుడితో...! 
ఇటీవలే ‘కె–ర్యాంప్‌’ సినిమాతో సక్సెస్‌ అందుకున్న కిరణ్‌ అబ్బవరం ప్రజెంట్‌ ‘చెన్నై లవ్‌స్టోరీ’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే ఇటీవల మరో రెండు మూడు కొత్త సినిమాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని తెలిసింది. ఈ చిత్రాల్లో ఒకటి సుకుమార్‌ శిష్యుడు వీర అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని తెలిసింది.

జటాయులో..? 
ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ‘జటాయు’ అనే టైటిల్‌తో ఓ పవర్‌ఫుల్‌ స్టోరీని ఎప్పుడో సిద్ధం చేశారు. కానీ ఈ కథతో ఈ చిత్రం ఇంకా సెట్స్‌కు వెళ్లలేదు. ఇందులో విజయ్‌ దేవరకొండ వంటి వారు హీరోలుగా నటిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఈ ‘జటాయు’ స్టోరీని ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ మేకా విన్నారని, ఈ యువ హీరోతో ఈ’ సినిమా ఆల్మోస్ట్‌ ఖరారై పోయిందని, ‘దిల్‌’ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా విషయాలపై అధికారిక ప్రకటన రానుందట. ఇక రోషన్‌ ప్రజెంట్‌ ‘చాంపియన్‌’ అనే ఓ పీరియాడికల్‌ స్పోర్ట్స్‌ డ్రామాతో బిజీగా ఉన్నారు. జీ స్టూడియోస్‌ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. 
ఇలా తమ కొత్త సినిమాల కోసం కథలు వింటున్న హీరోలు మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement