
తెలుగు యువ దర్శకుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏకంగా చెప్పుతో కొట్టుకున్నాడు. మంచి సినిమా తీసినా సరే జనాలు ఎందుకు రావట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇక టాలీవుడ్‌లో ఉండనని అంటున్నాడు. ఇంతకీ అసలేమైంది? ఈ డైరెక్టర్‌కి వచ్చిన కష్టమేంటి?
వినాయక చవితి వీకెండ్‌లో సుందరకాండ, అర్జున్ చక్రవర్తి, త్రిభాణదారి బార్బరిక్ లాంటి తెలుగు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. మలయాళ డబ్బింగ్ మూవీ 'కొత్త లోక' కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. వీటిలో 'కొత్త లోక' చిత్రానికి ఉన్నంతలో పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో 'త్రిభాణధారి బార్బరిక్' దర్శకుడు మోహన్ శ్రీవత్స ఆవేదనకు లోనయ్యాడు. తన బాధని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
(ఇదీ చదవండి: దీనస్థితిలో 'కేజీఎఫ్' నటుడు.. సాయం చేయాలని వేడుకోలు)
'తాజాగా 'బార్బరిక్' ఆడుతున్న థియేటర్‌కి వెళ్తే లోపల పది మంది మాత్రమే ఉన్నారు. నేనెవరో చెప్పకుండా సినిమా ఎలా ఉందని అడిగితే అందరూ బాగుందని చెప్పారు. అలానే నిన్న(శనివారం) సాయంత్రం నా భార్యతో మూవీ చూసేందుకు వెళ్లాను. మనసు ఏం బాగోలేక అరగంటలోనే ఇంటికి తిరిగొచ్చేశాను. నేను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటానో అని భయపడి నా భార్య కూడా నాతో పాటు వచ్చేసింది. ఇంత మంచి సినిమా తీస్తే జనాలు ఎందుకు రావట్లేదు భయ్యా. నాకు అసలు ఇది అర్థం కావట్లేదు. మలయాళం నుంచి సినిమాలు వస్తే.. అక్కడ మంచి కంటెంట్ వస్తే థియేటర్లకు వెళ్తున్నారు కదా. ఇక మలయాళంలోనే సినిమాలు తీస్తా, అక్కడ హిట్ కొట్టి నిరూపించుకుంటా. సినిమా నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటానని అన్నాను కదా అందుకే నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నాను' అని డైరెక్టర్ మోహన్ శ్రీవత్స వీడియో పోస్ట్ చేశాడు.
సత్యరాజ్, ఉదయభాను `త్రిభాణధారి బార్బరిక్`లో ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి బాగుందనే టాక్ వచ్చింది. కానీ స్టార్స్ లేకపోవడం వల్లనో ఏమో గానీ జనాలు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. దర్శకుడికి ఆవేదన ఉండొచ్చు కానీ ప్రస్తుతం జనాలు.. స్టార్ హీరోల చిత్రాలైతేనే థియేటర్లలోకి వచ్చి చూస్తున్నారు. చిన్న చిత్రాలైతే ఓటీటీలో చూసుకోవచ్చులే అనే మైండ్ సెట్‌తో ఉంటున్నారు.
(ఇదీ చదవండి: 'జెర్సీ' వదులుకున్నా.. ఇప్పటికీ బాధపడుతున్నా: జగపతి బాబు)