
'కేజీఎఫ్' సినిమా కన్నడ ఇండస్ట్రీ స్థాయిని పెంచింది. హీరో యష్‌ని పాన్ ఇండియా సూపర్ స్టార్ హీరో చేసింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ అయితే ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు. ఈ మూవీలో నటించిన కొందరు యాక్టర్స్ కూడా బాగానే పేరు తెచ్చుకున్నారు. కానీ ఇదే చిత్రంలో నటించిన ఓ నటుడు మాత్రం ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తీవ్ర అనారోగ్య సమస్యలతో తనకు ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్నాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'కేజీఎఫ్' తొలి భాగంలో హీరో ముంబైలో ఉంటాడు. అతడితో పాటు ఛాఛా అనే ముస్లిం వ్యక్తి ఒకరు ఉంటారు. ఆ పాత్ర చేసిన నటుడి పేరు హరీశ్ రాయ్. చాన్నాళ్లుగా కన్నడలో సినిమాలు చేస్తున్నారు. 'కేజీఎఫ్'తో కాస్తంత ఫేమ్ వచ్చింది. అయితే రెండో పార్ట్ రిలీజైన నాటికే ఇతడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఇప్పుడు అది నాలుగో స్టేజీకి చేరింది. దీంతో నటుడు హరీశ్.. మరీ బక్కపలుచగా మారిపోయాడు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: 'జెర్సీ' వదులుకున్నా.. ఇప్పటికీ బాధపడుతున్నా: జగపతి బాబు)
ప్రస్తుతం నాలుగో స్టేజీ థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న హరీశ్ రాయ్.. ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. దాతలు ఎవరైనా తనకు సాయం చేయాలని మీడియా ద్వారా వేడుకున్నాడు. ఈ క్రమంలోనే హీరో ధ్రువ్ సర్జా తనకు తోచినంత డబ్బులు ఇచ్చాడు. దీనిపై స్పందించిన హరీశ్.. సదరు హీరోకి ధన్యవాదాలు తెలిపాడు. ఆ వీడియోని కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
రెండు భాగాలగా వచ్చిన 'కేజీఎఫ్'.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అయితే ఈ సినిమాలో చేసిన సీనియర్ నటులు గత కొన్నేళ్లలో అనారోగ్య కారణాలతో చనిపోయారు. కొన్నిరోజుల ముందు కూడా శెట్టి పాత్రధారి దినేశ్ మంగళూరు.. బ్రెయిన్ స్ట్రోక్‌తో చనిపోయాడు. ఇప్పుడు ఛాఛా పాత్రధారి క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతుండటంతో ప్రేక్షకులు, నెటిజన్ల మనసు కలత చెందుతోంది.
(ఇదీ చదవండి: 'హరిహర'.. మరోసారి స్పందించిన క్రిష్)