
గత నెలలో రిలీజైన 'హరిహర వీరమల్లు' ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిర్మాతకు భారీ నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకుడిగా వ్యవహరించారు. మరి ఏమైందో ఏమో గానీ ఈయన తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ.. మిగిలిన పార్ట్ అంతా తీశారు. సరే ఫలితం ఏంటనేది పక్కనబెడితే ఇప్పుడు క్రిష్.. ఈ మూవీ గురించి స్పందించాడు.
'హరిహర వీరమల్లు' ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేసిన తర్వాత నిర్మాతగా 'అరేబియా కడలి' అనే సిరీస్ తీసిన క్రిష్.. హీరోయిన్ అనుష్కని లీడ్ రోల్‌లో పెట్టి 'ఘాటీ' అనే యాక్షన్ మూవీ తీశారు. సెప్టెంబరు 5న ఇది థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన క్రిష్.. 'హరిహర..' వచ్చిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు. రిలీజ్ టైంలో ట్వీట్ చేసిన ఈ దర్శకుడు.. ఇప్పుడు నేరుగా మాట్లాడాడు.
(ఇదీ చదవండి: ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి అప్పుడే చేసుకుంటాం: హీరోయిన్ నివేతా)
'హరిహర వీరమల్లు కొంత భాగం నేను చిత్రీకరించాను. నా వ్యక్తిగత కారణాల వల్ల పక్కకు రావాల్సి వచ్చింది' అని క్రిష్ చెప్పుకొచ్చాడు. బహుశా ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుండటమే క్రిష్.. సినిమా నుంచి బయటకు రావడానికి కారణం ఏమో అనిపిస్తుంది. అనుష్కతో చేసిన 'ఘాటీ'పై ఓ మాదిరి బజ్ అయితే ఉంది.
'ఘాటీ'లో అనుష్క లీడ్ రోల్ చేయగా.. తమిళ హీరో విక్రమ్ ప్రభు ఈమె సరసన నటించాడు. కొండల్లో స్మగ్మింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. యువీ క్రియేషన్స్ నిర్మించింది. రెండేళ్ల క్రితం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' మూవీతో సక్సెస్ అందుకున్న స్వీటీ.. ఈసారి ఏం చేస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: 'జెర్సీ' వదులుకున్నా.. ఇప్పటికీ బాధపడుతున్నా: జగపతి బాబు)