
టాలీవుడ్ హీరోయిన్ నివేతా పేతురాజ్ ప్రేమలో ఉంది. వినాయక చవితి సందర్భంగా తన ప్రియుడిని పరిచయం చేసింది. దుబాయికి చెందిన బిజినెస్‌మ్యాన్ రజిత్ ఇబ్రాన్‌తో రిలేషన్‌లో ఉన్నాననే విషయాన్ని అధికారికంగా బయటపెట్టింది. అయితే అసలు ఈ ప్రేమకథ ఎప్పుడు మొదలైంది? ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? తదితర విషయాల్ని ఇప్పుడు స్వయంగా నివేతా రివీల్ చేసింది.
మధురైలో పుట్టి పెరిగిన నివేతా.. 2016లో ఓ తమిళ సినిమాతో నటిగా మారింది. 'మెంటల్ మదిలో' అనే మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. చిత్రలహరి, బ్రోచేవారెవరా, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్, విరాటపర్వం, దాస్ కా దమ్కీ తదితర మూవీస్ కూడా చేసింది. ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేవు. అయితే ఓవైపు నటిస్తూనే దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచింది.
(ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టించే మూవీ.. చేయని తప్పుకు అమ్మాయి జీవితం బలి!)
స్వతహాగా హీరోయిన్ అయినప్పటికీ రేసింగ్, బ్యాడ్మింటన్‌లోనూ నివేతాకు ప్రతిభ ఉంది. ఈ క్రమంలోనే ఐదేళ్ల క్రితం దుబాయిలో ఓ రేసింగ్ సందర్భంగా రజిత్‌తో తనకు పరిచయమైందని నివేతా చెప్పింది. తొలుత స్నేహితులుగానే ఉన్నామని, కొన్నాళ్లకు ఇద్దరం అనుకుని ప్రేమికులు అయ్యామని చెప్పింది. తన సర్కిల్‌లో చాలా తక్కువమందికి మాత్రమే తన ప్రేమ గురించి తెలుసని, ఇండస్ట్రీలోనూ ఎవరికీ ఈ విషయం తెలియదని పేర్కొంది. తన ప్రేమ గురించి బయటపెట్టడం తన మేనేజర్‌తో సహా అందరికీ షాక్ అని తెలిపింది.
ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలుపెట్టేశామని చెప్పిన నివేతా.. అక్టోబరులో నిశ్చితార్థం చేసుకుంటామని రాబోయే జనవరిలో పెళ్లి ఉంటుందని పేర్కొంది. తేదీ ఇంకా నిర్ణయించలేదని చెప్పుకొచ్చింది. తమ ఇద్దరి కుటుంబాలు దుబాయిలో ఉంటున్నాయని, అలానే తమ వివాహాన్ని సింపుల్‌గా సన్నిహితుల సమక్షంలో చేసుకుంటామని నివేతా చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: ‘థాంక్యూ జగన్ గారు’.. అల్లు అర్జున్ ట్వీట్)