
టాలీవుడ్ సినిమా 'త్రిబాణధారి బార్బరిక్' విడుదల తర్వాత ఈ టైటిల్ బాగా వైరల్ అయింది. అందుకు ప్రధాన కారణం ఆ చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స అని చెప్పవచ్చు. సినిమా విడుదల తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. మంచి సినిమా తీసినా సరే తనకు సపోర్టుగా ఎవరూ నిలబడలేదని ఆయన బాధ పడ్డారు. చాలా కష్టపడినప్పటికీ తగిన ఫలితం దక్కలేదంటూ చెప్పుతో కొట్టుకుని అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. అయితే, తాజాగా ఆయన మరో వీడియోతో క్లారిటీ ఇచ్చారు.
'త్రిబాణధారి బార్బరిక్' సినిమా కోసం తన కుటుంబాన్ని కూడా బాధ పెట్టానని దర్శకుడు శ్రీవత్స చెప్పారు. ఆపై భావోద్వేగానికి గురై సినీ ప్రేక్షకులను కూడా ఇబ్బంది పెట్టానని ఆయన చింతించారు. ఈ సినిమా నచ్చకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చునని తెలిపారు. ప్రేక్షకులు ఏదైనా కొత్తగా ఆలోచించాలనే ఈ సినిమాను తెరకెక్కించాను. మలయాళ సినిమాకు దక్కిన ఆదరణ కూడా తన మూవీకి దక్కకపోయేసరికి జీర్ణించుకోలేకపోయానన్నారు. ఈ మూవీ గురించి ఎవరూ మాట్లాడకపోవడంతో అలా చెప్పుతో కొట్టుకున్నట్లు తెలిపారు. ఆ వీడియో ఎవరికైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కోరారు.
సినిమా రిజల్ట్ చూసి ఉదయభాను కూడా గుక్కపెట్టి ఏడ్చేశారని శ్రీవత్స అన్నారు. దీంతో తాను కూడా కన్నీళ్లు పెట్టుకున్నాని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో నటుడు నరేశ్ కూడా బాధ పడ్డారని గుర్తుచేసుకున్నారు. అయితే, వీడియో వైరల్ అయ్యాక ఇతర దేశాల్లో సినిమా చూసిన వారు తనకు మెసేజ్ చేశారని వాటిని పంచుకున్నారు. సినిమా బాగుందని మెచ్చుకోవడంతో కాస్త సంతోషాన్నిచ్చింది. కానీ, ఇక్కడ కనీసం సినిమా బాగుంది, బాగాలేదు అని కూడా చెప్పడం లేదన్నారు. అందుకే ఎమోషనల్ అయినట్లు ఆయన చెప్పుకొచ్చారు. సినిమా చూసి తప్పులు చెబితే మరోసారి జరగకుండా చూసుకుంటాను కదా అని కోరారు.