
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రసంగానికి ఆకర్షితుడై ఓ వ్యక్తి బొక్కబోర్లా పడ్డాడు. ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టడంపై ఆమె చేసిన ప్రసంగ వీడియో తిలకిస్తున్న సమయంలో స్క్రీన్‌పై వచ్చిన ఓ యాప్ అతడి కొంపముంచింది. పెట్టుబడి పెడితే రెండు వారాల్లోపు మంచి రాబడి వస్తుందని ఇచ్చిన హామీ మేరకు రూ.39,694లు చెల్లించి మోసపోయిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. యూసుఫ్‌గూడ ప్రగతినగర్‌లో నివసించే జనార్దన్‌రెడ్డి(44) సినీ రచయిత. ఈ నెల 11న ఉదయం ఫేస్‌బుక్‌లో వీడియోలు తిలకిస్తున్న సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్రేడింగ్, పెట్టుబడి గురించి వివరించే వీడియో కనిపించింది. అది నిజమైనదిగా భావించి వీడియో ఓపెన్ చేశాడు. ట్రేడింగ్ ప్రయోజనాల కోసం రూ.21 వేలు పెట్టుబడి పెట్టడం గురించి మాట్లాడుతుండగా ఆకర్షితుడై, అక్కడ ఉన్న లింక్‌పై క్లిక్ చేశాడు. మరిన్ని వివరాల కోసం జీపీడీ అడిపెక్స్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించడంతో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, తన పేరు, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ వంటి సమాచారాన్ని నమోదు చేశారు.
పెట్టుబడి పెడితే రెండు వారాల్లో రాబడి వస్తుందని నమ్మబలికారు. దీంతో ఆయన తన క్రెడిట్ కార్డును ఉపయోగించి రూ.39,694లను చెల్లించాడు. ఆ వీడియోను కుటుంబ సభ్యులకు చూపించగా అది నకిలీదిగా గుర్తించారు. వెంటనే బ్యాంక్‌కు సమాచారం ఇచ్చి ఆ మొత్తాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించారు. అనంతరం 1930కు ఫిర్యాదు చేశారు. తనను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.