
పవన్ కల్యాణ్ ఓజీ సినిమాకు తెలంగాణలో బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపును రద్దు చేయాలంటూ తెలంగాణ పోలీస్ శాఖ జీవో రిలీజ్ చేసింది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ యాజమాన్యాలను ఆదేశించింది. ఓజీ టికెట్ రేట్స్ పెంపును తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసిన తర్వాత.. జరిగిన పరిణామాలను పోలీస్ శాఖ తన జీవోలో ప్రస్తావించింది. అంతకుముందు ప్రీమియర్ షోలతో పాటు అక్టోబరు 4 వరకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తెలంగాణ గవర్నమెంట్ అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే.
టికెట్ రేట్లపై పిటిషన్
ఓజీ టికెట్ రేట్ల పెంపును సవాల్ చేస్తూ మహేశ్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ.. జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ఈ నెల 24న ఆదేశాలు జారీ చేశారు. ఈ సినిమా టికెట్ రేట్లపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ ఈ నెల 26 వరకు స్టే విధించింది. రివ్యూ పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 9వ తేదీకి వాయిదా వేసింది. అంతేకాకుండా టికెట్ ధరలు ఎందుకు పెంచాలనుకుంటున్నారో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.