
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా బెనిఫిట్ షోతో పాటు టికెట్ ధరలను భారీగా పెంచేశారు. అయితే, హోంశాఖ ముఖ్యకార్యదర్శి జారీచేసిన మెమో అమలును సస్పెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. కానీ, కోర్టు నుంచి వచ్చిన ఆదేశాలను కూడా లెక్క చేయలేదని చిత్ర యూనిట్‌పై విమర్శలు వస్తున్నాయి. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా పాటించరా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కోర్టు ఆదేశాల తర్వాత కూడా బుక్ మై షోతో పాటు డిస్ట్రిక్ట్ యాప్‌లలో పెంచిన ధరలే కనిపిస్తున్నాయని కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయంలో న్యాయస్థానం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆపై ఓజీ సినిమాకు ‘A’ సర్టిఫికేట్ జారీ చేయడంతో 18 ఏళ్ల లోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించకుండా చూడాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.. దానిని కూడా వారు పాటించకుండా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఓజీ ప్రీమియర్ షో టికెట్ ధర రూ. 800 పెంపుతో పాటు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 150 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనిని సవాల్ హైదరాబాద్‌కు చెందిన బి.మల్లేశ్‌యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు. 2021లో జారీచేసిన జీవో120కి విరుద్ధంగా ఓజీ సినిమా టికెట్ ధరలు ఉన్నాయన్నారు. దీంతో న్యాయస్థానం కూడా ప్రభుత్వాన్ని తప్పుబడుతూ పలు వ్యాఖ్యలు చేసింది. కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలను ఎవరి ప్రయోజనాల కోసం ప్రదర్శిస్తున్నారని సూటిగానే కోర్టు ప్రశ్నించింది.
ఈ షోలతో వచ్చిన డబ్బుతో అనాథలకు ఏమైనా ఆసరాగా వినియోగిస్తున్నారా అంటూ చెప్పాలని కోరింది. కేవలం ఎగ్జిబిటర్లకు లాభాలు చేకూర్చడానికి ఇలా టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతిస్తారా అంటూ కడిగిపారేసింది. ఇందుకోసం ప్రభుత్వ నిబంధనలనే ఉల్లంఘిస్తే ఎలా అంటూ ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. అయినప్పటికీ టికెట్ ధరలను మాత్రమ తగ్గించలేదు. దీంతో న్యాయస్థానం అంటూ ఎలాంటి గౌరవం లేదా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.