
సాక్షి, డిల్లీ: తన పేరుతో మార్ఫింగ్ వీడియోలు చేయడం ఆపాలంటూ హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఏఐ సాయంతో యూట్యూబ్ షార్ట్స్, వీడియోలు క్రియేట్ చేయడం, వాటికి నాగార్జున హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం ఆపేయాలని పిటిషన్ వేశారు. తన అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు, పేరు ఉపయోగించి వెబ్ సైట్స్ బిజినెస్ చేయడాన్ని ఆపాలని పిటిషన్‌లో కోరారు. ఐశ్వర్య రాయ్ ఫోటోలు ఉపయోగించి సొమ్ము చేసుకున్న తరహాలోనే తన ఫోటోలు, పేరు వాడుకుంటున్నారని పేర్కొన్నారు.
పేరు దుర్వినియోగం
ఏఐ సాయంతో పోర్నోగ్రఫీ కంటెంట్, లింక్స్ క్రియేట్ చేశారని నాగార్జున తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. టీ షర్టులపై ఆయన ఫోటో ముద్రించి బిజినెస్ చేస్తున్నట్లు వెల్లడించారు. హీరో పేరును, ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారని, నాగార్జున వ్యక్తిగత హక్కులను కాపాడాలని పిటిషన్‌లో కోరారు. నాగార్జున ఏఐ వీడియోలు అప్‌లోడ్ చేసిన 14 వెబ్ సైట్స్ ఆ లింక్స్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై జస్టిస్ తేజస్ కరియా ధర్మాసం గురువారం విచారించింది. నాగార్జున పర్సనాలిటీ రైట్స్ కాపాడుతామని తెలిపింది.

గతంలో..
గతంలో బాలీవుడ్ హీరోహీరోయిన్లు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అనిల్ కపూర్ తదితరులు తమ వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సినీనటుల అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దంటూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే నాగార్జున సైతం కోర్టును ఆశ్రయించారు.