‘ఐబొమ్మ’ పైరసీ సినిమా వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా చంచల్‌గూడ జైలులో ఉన్న రవిని దర్యాప్తు అధికారులు కస్టడీలోకి తీసుకుని ఐదు రోజులపాటు విచారించనున్నారు. ఈ క్రమంలో రవిని పోలీసులు మొదటిరోజు విచారించారు. అందులో భాగంగా రవి 'నేను ఒంటరిని… మీ ఇష్టం వచ్చింది చేసుకోండి' అంటూ ఎలాంటి భయం లేకుండా అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పారట. అతని కోసం వెళ్లిన న్యాయవాదులను కూడా కలిసేందుకు అతను ఇష్టపడలేదట. తన స్నేహితుడు వస్తాడని మాత్రం చెప్పినట్లు తెలుస్తోంది. తనది ఒంటరి జీవితమని.. పట్టించుకునేవారు ఎవరూ లేరని చెబుతూనే.. మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని పోలీసులతో రవి పేర్కొన్నాడట.
విచారణలో భాగంగా చంచల్‌గూడ జైలు నుంచి రవిని సీసీఎస్‌కు పోలీసులు తీసుకొచ్చారు. మొదటిరోజు విచారణలో అతని నెట్‌వర్క్ గురించి తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. విడుదలైన సినిమాను ఎలా పైరసీ చేస్తాడు.. ఆపై ఎలా ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తాడు వంటి అంశాలను రవి నుంచి రాబట్టారట. అయితే, రవి కూడా అధికారులకు పూర్తిగా సహకరించారట. నాకు తెలియదు, చెప్పను అనే సినిమా డైలాగ్స్ పేల్చకుండా విచారణ అధికారులకు తన వెబ్‌సైట్‌ను ఎలా నిర్వహిస్తాడో చెప్పాడట. ఐబొమ్మ సినిమాను పోలీసులకు కళ్లకు కట్టినట్టు చూపించాడట.
అప్పుడే విడుదలైన సినిమాను ఎక్కడ రికార్డ్ చేస్తారు..? క్వాలిటీ ఎలా పెంచుతారు..? వంటి అంశాలతో పాటు ఐబొమ్మ సర్వర్‌లోకి ఎలా పంపుతారనే అంశాలన్ని చాలా క్లియర్‌గా రవి వివరించాడట. ఈ క్రమంలో ఏమైనా టెక్నికల్ సమస్యలు వస్తే వాటిని అధిగమించే ప్లాన్‌ను కూడా పంచుకున్నాడట. తన కోసం పనిచేసే ఏజెంట్లు కూడా ఉన్నట్లు తెలిపాడట. వాళ్లకు కొంత డబ్బులిచ్చి సినిమా ప్రింట్ తీసుకుంటానని రవి చెప్పాడట. సినిమా విడుదలకు ముందే క్యూబ్‌ను ఏ విధంగా హ్యాక్ చేస్తారో కూడా రవి వివరంగా తెలిపాడట.


