ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సబేష్ (68) ఇక లేరు (MC Sabesh). కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం 12.15 గంటల ప్రాంతంలో చైన్నెలో కన్నుమూశారు. ఈయన ప్రఖ్యాత సంగీత దర్శకుడు దేవా సోదరుడు. మరో సోదరుడు మురళితో కలిసి పలు చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అదేవిధంగా పలు సంగీత కచేరీలను నిర్వహించారు. వీరు సంగీతాన్ని అందించిన చిత్రాలలో సముద్రం, మాయాండి కుటుంబత్తార్, పొక్కిషం, తవమాయ్ తవమిరుందు వంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి.
నివాళులు అర్పించిన కార్తీ
సబేష్.. సినీ సంగీత కళాకారుల సంఘానికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. స్థానిక వలసరవాక్కంలోని చౌదరినగర్‌లో నివసిస్తున్న సబేష్‌కు గీత, అర్చన అనే ఇద్దరు కూతుర్లు, కార్తీక్ అనే కొడుకు ఉన్నారు. ఈయన భార్య తార ఇంతకుముందే కన్నుమూశారు. సబేష్ భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. దక్షిణ భారత సినీ నటినటుల సంఘం (నడిగర్) కోశాధికారి, హీరో కార్తీ, ఉపాధ్యక్షుడు కరుణాస్ తదితరులు నివాళులు అర్పించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక బృందావన్ నగరంలోని శ్మశానవాటికలో సబేష్ అంత్యక్రియలు జరగనున్నాయి.


