బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ లాంటి చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చూపించిన దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli) ఇప్పుడు వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి సినిమాలను బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు. 'వారణాసి’ ఈవెంట్‌లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి దారి తీశాయి.

అసలేం జరిగింది?
నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో రాజమౌళి కొత్త సినిమా 'వారణాసి' టైటిల్ లాంచ్ ఈవెంట్ జరిగింది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌లతో పాటు రాజమౌళి కుటుంబం ఈ ఈవెంట్‌కి కూడా హాజరయ్యారు. సాంకేతిక లోపం వల్ల ఈవెంట్ కాస్త ఆలస్యంగా ప్రారంభం అయింది. తాను అనుకున్నట్లుగా ఈవెంట్ జరగకపోవడంతో జక్కన్న కాస్త నిరాశకు లోనయ్యాడు. తన బాధను అభిమానులతో పంచుకున్నాడు ‘నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు. కానీ మా నాన్నగారు(విజయేంద్ర ప్రసాద్) టెన్షన్ పడొద్దని, 'హనుమంతుడు అన్నీ సవ్యంగా నడిపిస్తాడు' అని చెప్తూ ఉంటారు.
ఇప్పుడు ఈ ఈవెంట్ సాంకేతిక లోపాలతో ఆగిపోయింది.. ఆయన ఏం చేస్తున్నాడు? అందుకే నాన్న అలా అంటే నాకు కోపం వస్తుంది’ జక్కన్న ఎమోషనల్ అయ్యాడు. దేవుడిని నమ్మనంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వివాదానికి దారీతీశాయి. 'హనుమంతుడిని అవమానించాడు’ అంటూ హిందూ సంఘాలు రాజమౌళిపై భగ్గుమన్నాయి. రాజమౌళి వ్యాఖ్యలపై రాష్ట్రీయ వానరసేన (వానర సేనా) సంస్థ హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 'హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారు' అని ఆరోపిస్తూ, రాజమౌళి, మహేష్ బాబు ఇళ్లను ముట్టడిస్తామని, సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. వారణాసిలో కూడా మరో కేసు నమోదు అయింది.

భగ్గుమన్న బీజేపీ నేతలు
బీజేపీ నేతలురాజమౌళిని తీవ్రంగా విమర్శించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ..‘రాజమౌళి నిజంగా నాస్తికుడైతే బహిరంగంగా చెప్పాలి లేదా క్షమాపణ చెప్పాలి. దేవుళ్ల కథలతో సినిమాలు తీసి కోట్లు సంపాదించి, ఇప్పుడు 'నమ్మకం లేదు' అంటే ఏమిటి? బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌లా హిందూ కథలు ఉపయోగించి డబ్బులు దక్కించుకున్నాడు. హిందూ సమాజం అతని ప్రతి సినిమాను బహిష్కరించాలి. గతంలో రాముడి కథను 'బోరింగ్' అని, శ్రీకృష్ణుడి దాసీలపై కామెంట్స్ చేశాడు. ఇలాంటి వాళ్ల సినిమాలు చూడకూడదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రి, బీజేపీ నాయకుడు బండి సంజయ్ స్పందిస్తూ జక్కన్నపై తనదైన శైలీలో సెటైర్లు వేశాడు. ‘రాజమౌళి నిండు నూరేళ్ళు బతికి మంచిగా సక్సెస్ అవ్వాలని అమ్మవారిని కోరుతున్నాను. దేవుడు కరుణించి రాజమౌళి దేవుడిని నమ్మే విధంగా మార్చి.. ఆయన కరుణ కటాక్షాలు రాజమౌళిపై ఉండాలని కోరుకుంటున్నా అని బండి సంజయ్ అన్నారు.
బీజేపీ నేత చికోటీ ప్రవీణ్ మాట్లాడుతూ..‘రాజమౌళి తీరు 'మదం ఎక్కిన ఏనుగు మురికి కాల్వలో పడ్డట్టు'. అహంకారంతో వెళ్తే పతనం ఖాయం. దేవుడి పేరుతో సినిమాలు తీసి డబ్బులు సంపాదించి, ఇలా మాట్లాడటం తగ్గదు. వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలి’ అని ఫైర్ అవ్వడం లేదు. రాజమౌళి లాంటి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలంటూ బీజేపీ నాయకురాలు మాధవీలత సూచించారు.

టైటిల్ విషయంలోనూ..
హనుమంతుడి విషయంతో పాటు, సినిమా టైటిల్ కూడా వివాదాస్పదం అయింది. తెలంగాణ డైరెక్టర్-నిర్మాత సుబ్బారెడ్డి 'రామభక్త హనుమ క్రియేషన్స్' బ్యానర్‌లో 'వారణాసి' టైటిల్‌ను తెలుగులో ముందే రిజిస్టర్ చేసి ఉన్నారు. రాజమౌళి టీమ్ దీనిని తెలుగులో వాడలేక, ఇంగ్లీష్‌లో 'Varanasi'గా రిజిస్టర్ చేసి, అదే టైటిల్‌తో ముందుకు సాగుతున్నారు. సుబ్బారెడ్డి తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. ఇది లీగల్ ఇష్యూకు మారే అవకాశం ఉందని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
పెదవి విప్పన జక్కన్న
మీడియాలో, సోషల్ మీడియాలో ఇంత ట్రోలింగ్ జరుగుతున్నా... హిందూ సంఘాలు కేసులు పెడుతున్నా..బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నా..రాజమౌళి మాత్రం పెదవి విప్పడం లేదు. ఈ వివాదం మొదలై నాలుగైదు రోజులైనప్పటికీ..అతని నుంచి స్పందన లేకపోవడం ఆశ్చర్యాన్నికలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తే.. రాజమౌళి క్షమాపణలు చెబితే తప్ప ఈ వివాదం ముగిసేలా కనిపించడం లేదు. మరి జక్కన్న క్షమాపణలు చెబుతాడా లేదా? చూడాలి.


