Over the Top: ఓటీటీ.. కళగూరగంప

Special Story On OTT - Sakshi

కరోనా కాలాన్ని కాటేసినప్పుడు.. 
కాసింత చలనం కలిగించింది ఓటీటీ ఒక్కటే!
అంతా నిర్మానుష్యమైనా ఓవర్‌ ది టాప్‌ మాత్రం కళకళలాడింది.
ఓవర్‌ ది టాప్‌ మాత్రం రద్దీగా ఉంది..
కోవిడ్‌ పెంచిన దిగులును డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ మెల్లమెల్లగా తుడిచేసి వినోదం పంచింది.
చిమ్మచీకటిలో వెలుగురేఖలా మెరిసి విస్తరించింది.
ఇంటింటా వినోదాల దీపాలను వెలిగించింది.
వెలుగు వెనక చీకటి కూడా ఉంటుంది. దానికో కథ కూడా ఉంటుంది. 
ఓటీటీ చీకటి వెలుగుల వృత్తాంతమే ఈ కవర్‌ కథనం...

అద్భుతాలను ఊహించుకునే కాలం కాదు ఆస్వాదించే కాలమిది. ఇంకా చెప్పాలంటే ఊహించనివి ఒక్కసారిగా  అనుభవంలోకి వచ్చే కాలం. అలాంటిదే  ఓటీటీ. నాటకాలను సినిమాలు మరుగున పడేస్తే .. సినిమాలను టెలివిజన్‌ పలచన చేస్తే.. దాన్ని మరిపించేందుకు పోటీలో ఉన్నాయీ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌. సీరియళ్లను మించిన సిరీస్‌ అవీ సీజన్ల కొద్దీ, ఆధునిక సాంకేతికత, రాజీ పడని బడ్జెట్‌తో థియేటర్లోని సినిమాలను చాలెంజ్‌ చేస్తూ ఓటీటీ ఒరిజినల్స్‌తోపాటు సినిమాలు, టీవీ చానళ్ల సీరియళ్లు, రియాలిటీ షోలనూ మిస్‌ కానివ్వట్లేదు ఈ వేదికలు. ఉపగ్రహ చానళ్లను తలదన్నే వినోదాన్ని ప్రసారం చేస్తున్నాయి. సిరీస్‌లు, టీవీ చానళ్ల సీరియళ్లు, షోలు, సినిమాలే కాక బయోగ్రఫీలు, డాక్యుమెంటరీలు, షార్ట్‌ ఫిల్మ్స్, ఇంటర్వ్యూలు, స్పోర్ట్స్, మ్యూజిక్, కామిక్స్, స్టాండప్‌ కామెడీస్,  కార్టూన్‌ పిక్చర్స్, గాసిప్స్‌ సహా  అన్నిటినీ ఒకే ప్లాట్‌ఫామ్‌లో అందిస్తున్నాయి కళగూరగంపలా! అందుకే ఆదరణ పొందుతున్నాయి. డిపెండెంట్‌గా ఇవి మన దగ్గర  దాదాపు పదమూడేళ్ల కిందటే మొదలైనా ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం నాలుగైదేళ్లుగానే. మన దేశంతో సహా ప్రపంచ నలుమూలలకూ చేరింది కరోనా లాక్‌డౌన్‌ కాలంలోనే.

వాచింగ్‌ లైబ్రరీ
ఓటీటీలతో వినోదరంగంలో ఉత్పత్తి పెరిగింది. సృజనాత్మకత పరిధీ విస్తృతమైంది. రచయితలు, సాంకేతిక నిపుణులు, కళాకారులకూ అవకాశాలు హెచ్చాయి. సినిమాల్లో చోటు సంపాదించుకోలేని,  చోటు దొరకని, చాన్సులు తగ్గిన ప్రతిభావంతులకు టెలివిజన్‌ ఎలాగైతే స్థానమిచ్చిందో ఆ పరంపరను డిజిటల్‌ వేదికలూ కొనసాగిస్తూ కొత్త టాలెంట్‌నూ పరిచయం చేస్తున్నాయి. ఇదివరకైతే ప్రాంతీయ భాషా చిత్రాల ప్రదర్శనకు దూరదర్శన్‌ ఒక్కటే ఆధారంగా ఉండేది. తర్వాత పలుభాషల్లో ఉపగ్రహ చానెళ్లు వచ్చినా.. మన కేబుల్‌ కనెక్షన్‌లో వాటిని చేర్చడానికి తగిన రుసుము పెరిగేది. ఆ అభిలాషకు ఓటీటీ వరమైంది. ప్రాంతీయ భాషా చిత్రాలే కాదు ప్రపంచ సినిమానే చూపెడుతోంది. దేశీయ పురస్కారం పొందిన వాటి దగ్గర్నుంచి అకాడమీ అవార్డు తీసుకున్న  మూవీస్‌ దాకా ఆ జాబితాలో ఉంటున్నాయి. లాభాలు గడించి పెట్టినవే కాదు ఎపిక్స్‌గా నిలిచిపోయినవి, సరదాగా అనిపించేవే కాదు సీరియస్‌నెస్‌ను చూపించినవి, రికార్డులు సృష్టించినవి, విడుదలకు నోచుకోనివి, చూడాల్సినవి, చూడకుండా మిగిలిపోయినవి, సాంకేతిక విలువలను ఫోకస్‌ చేసినవి,  జీవన పోరాటాన్ని తెరకెక్కించినవి,  చరిత్రను చెప్పినవి, నాగరికతను చూపించినవి, జాతి వైరాన్ని ఎలుగెత్తినవి, మతవైరుధ్యాలను ఎండగట్టినవి, సరిహద్దుల పోరుకు ఫ్రేమ్‌పట్టినవి,  అధిపత్య తీరును తూలనాడినవి, సామరస్యాన్ని చాటినవి ఇలా చెప్పుకుంటూ పోతే వీటితోనే నిండిపోయేట్టుంది ఈ పుట.

నగరాలకు మాత్రమే పరిమితమైన ఇంగ్లిష్‌ సినిమాలు, ఫిల్మోత్సవాలు, ఫిల్మ్‌క్లబ్‌లకు  మాత్రమే వచ్చే ఉత్తమ చిత్రాలు అన్నిటికీ తెరపడ్తోంది ఓవర్‌ ది టాప్‌. వినడమే తప్ప చూసే అవకాశం అరుదుగా లభించే  పాకిస్తానీ, ఇరానియన్, చైనీస్, జపనీస్, కొరియన్, లెబనాన్, టర్కీ,  జార్జియన్, యురోపియన్, ఆఫ్రికన్, స్పానిష్‌ (లాటిన్‌ అమెరికన్‌), కెనడా చిత్రాలకూ ఖజానా ఓటీటీ. ఇవి కాక ఆయా దేశాలు, భాషల సిరీస్, మినీ సిరీస్, ఒరిజినల్స్‌ అదనం. ఒక సినిమానో, సిరీస్‌నో చూస్తున్నామంటే టైమ్‌ పాస్‌ చేయడమే కాదు..  ఆయాదేశాల, ప్రాంతాల జీవన విధానాన్ని, కుటుంబ బంధాలను, సామాజిక పరిస్థితులనూ ఎంతోకొంత తెలుసుకుంటున్నట్టే. ఆ ప్రదేశాలను పర్యటించినంత అనుభూతి. ఓటీటీ వల్ల ఈ సౌకర్యం మరింత అందుబాటులోకి వచ్చిందని చెప్పొచ్చు. 

యుద్ధాలు భౌగోళిక హద్దులను ఏర్పాటు చేస్తే కళలు వాటిని చెరిపేసి మానవ సంబంధాలను పటిష్ఠం చేస్తాయి. వాటిల్లో సినిమా కళ ముందుంటుంది. ప్రపంచ చలనచిత్రాల ఖజానాగా ఉన్న ఓటీటీ ఆ కార్యక్రమాన్ని బృహత్తరంగా నిర్వహిస్తోంది. కొన్ని దేశాల మీదున్న అపోహలను తొలగిస్తోంది ఆ దేశాల జీవన సంస్కృతి ఇతివృత్తాలతో వచ్చిన సినిమాలను స్ట్రీమ్‌ చేసి. ఉదాహరణకు పాకిస్తాన్‌ సిరీస్‌లు, సినిమాలనే తీసుకోవచ్చు. హమ్‌సఫర్, జిందగీ గుల్జార్‌ హై వంటి సిరీస్‌లలో స్త్రీని స్వతంత్రవ్యక్తిత్వమున్న మనిషిగా చూపిస్తున్నాయి. అలాగే  బహుభార్యత్వాన్ని, బాల్య వివాహాలను వ్యతిరేకించే  దుఖ్తార్‌ వంటి సినిమాలూ కనిపిస్తాయి. కొన్ని మత సంప్రదాయాల అమలు మీదున్న ముందస్తు నిర్ధారణలనూ  కొట్టిపారేస్తున్నాయి ‘కెపర్‌నామ్‌ (లెబనీస్‌)’ వంటి సినిమాలు.

అంతేకాదు పాశ్చాత్యా దేశాలు కుటుంబం, సంబంధ బాం«ధవ్యాలకు పెద్దగా విలువివ్వవనే అభిప్రాయాలు చాలా మంది నోట వినిపిస్తుంటాయి. ఏ యురోపియన్, ఇంగ్లిష్, హాలీవుడ్‌ సినిమా తీసుకున్నా అది తప్పని తెలిసిపోతుంది. అంతదాకా ఎందుకూ అపరిచితులూ కలసి అనుబంధాల చూరు కింద కుటుంబంగా మారగలరని చూపించింది జపాన్‌ చిత్రం ‘షాప్‌ లిఫ్టర్స్‌’. అలాగే అభివృద్ధి చెందిన,  ఇదివరకు కమ్యూనిస్ట్‌ పాలనలో ఉన్న దేశాల్లో  స్త్రీలకు కుటుంబాల్లో గౌరవం, సమాన హక్కులు ఉంటాయనే భ్రమనూ పటాపంచలు చేస్తున్నాయి  ‘మై హ్యాపీ ఫ్యామిలీ (జార్జియన్‌)’ వంటి చిత్రాలు. ఇలాంటి ఎరుకను కలిగిస్తోంది ఓటీటీ ఆ తరహా సినిమాలను స్ట్రీమ్‌ చేస్తూ. పుస్తక పఠనం అలవాటు లేని, సినిమాలంటే ఆసక్తి ఉన్న ఎంతో మందికి  వాచింగ్‌ లైబ్రరీ ఇది. 

క్రియేటివ్‌ హబ్‌
థియేటర్‌లో సినిమాకు పరిమితులు ఉంటాయి. కళాత్మకతతో పాటు కాసుల గురించీ ఆలోచించాల్సిన అవసరం కల్పిస్తుంది. అందుకే కళాత్మకతను గ్లామర్‌ మింగేస్తుంది. క్యాష్‌ వాస్తవాన్ని దాస్తుంది. అదీగాక థియేటర్‌లో సినిమా ఒక చాయిస్‌. దాని విజయంలో మౌఖిక ప్రచారానిదే ప్రధాన పాత్ర. బాగుంది అని వినిపిస్తేనే థియేటర్‌ దాకా వెళ్తారు. బాలేదనిపిస్తే టికెట్‌ దండగ అని ఊరుకుంటారు.  కాని ఓటీటీ కథ వేరు.  దానికి బాక్సాఫీస్‌ గోల లేదు. ఆకాశమే హద్దు.  క్రియేటివిటీకే ప్రాధాన్యం. జానర్‌తో పట్టింపు లేదు. కథలో జీవితం కనిపిస్తే మరీ మంచిది. కనిపించకపోయినా కథనంతో నడిపించినా ఓకే. కనీసం ఇరవై నిమిషాలైనా  వీక్షకులు ఆ సినిమా, సిరీస్‌ ఎట్‌సెట్రా మీద ఏకాగ్రతను వెచ్చిస్తే చాలు. స్ట్రీమింగ్‌కి అర్హత సంపాదించినట్టే. పెట్టుబడికి ఢోకా లేనట్టే. టాకీసుల్లో విడుదలై ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న చాలా సినిమాలు ఓటీటీలో వీక్షకాదరణను దక్కించుకున్నాయి. కారణం నివరధికంగా రెండున్నర గంటలు కూర్చుని చూడాల్సిన ఆగత్యం లేకపోవడమే. ఇక్కడ మొబైల్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌ లేదా టీవీ వంటి ప్రసార సాధనాలు చాయిస్‌గా  కావు అడిక్షన్‌ అవుతాయి. ఓటీటీ ఇంటింటికీ చేరువవుతుంది. ఇక్కడ ఆస్వాదన కంటే కాలక్షేపమే ముఖ్యం. అందుకే అన్ని రకాలూ ఇందులో సేల్‌ అవుతాయి. సమీక్షలు ఓ సమాచారం మాత్రమే. ఉంటుంది. కాబట్టే వైవిధ్యమైన కథా వస్తువులు కొలువుదీరుతున్నాయి.

థియేటర్‌ సినిమాకి సాహసించని ఎన్నో అంశాలు ఓటీటీకి కంటెంట్‌గా మారుతున్నాయి. బయట బ్యాన్‌ అయినవి ఇక్కడ గుర్తింపుకు నోచుకుంటున్నాయి. సమాజాలు నిశ్శబ్దంగా ఉంచినవి ఇక్కడ సిరీస్, సినిమాల (వీటిల్లో ఓటీటీ ఒరిజినల్స్‌ ఎక్కువ) రూపంలో చర్చకు వస్తున్నాయి. మ్యారిటల్‌ రేప్, లింగవివక్ష నుంచి జాతి వివక్ష, ఎల్‌జీబీటీక్యూ ఆత్మగౌరవం దాకా, చరిత్ర తప్పిదాల నుంచి రాజకీయ, వ్యాపార కుట్రల వరకు ఆవిష్కృతమవు తున్నాయి. ప్రపంచ పరిణామాలూ తక్షణమే ఓటీటీకి సీరియస్‌ సిరీస్‌ లేదా సినిమా అవుతున్నాయి. లేదా ఆ వాతావరణాన్ని తలపించే సినిమాలను తీసుకొని స్ట్రీమ్‌ చేస్తోంది. దీనికి ఉదాహరణ.. మీ టూ మూవ్‌మెంట్,  కశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తి రద్దయినప్పుడు కశ్మీర్‌కు సంబంధించి, అమెరికాలో బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌ మూవ్‌మెంట్‌ మొదలైనప్పుడు బ్లాక్స్‌కు సంబంధించిన సినిమాలను ఓటీటీ స్ట్రీమ్‌ చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఓటీటీ ఒక యూనివర్శిటీ.. వినోదంతోపాటు కాస్త ప్రపంచజ్ఞానాన్ని పంచుతూ ఇటు వీక్షకులకు, సినిమా నిర్మాణ కళను అర్థం చేసుకోవడానికి అటు   సినీరంగ ఔత్సాహికులకూ. సినీ ఉద్ధండులకైతే ఇదొక ప్రయోగశాలే. 

అయినప్పటికీ కంటెంట్‌ మీద కంప్లయింట్‌ ఉంది.....కారణం వాటి మీద నియంత్రణ లేకపోవడమే. థియేటర్‌లో సినిమాలకు ఉన్నట్లు  కంటెంట్‌ను విశ్లేషించే సెన్సార్‌షిప్‌ ఓటీటీకి లేదు. అందుకే క్రైమ్, సెక్స్‌ సబ్జెక్ట్‌లనే ఎక్కువగా ఫోకస్‌ చేస్తోంది అనేది ఓటీటీ మీదున్న విమర్శ. టాకీస్‌ చాయిస్‌గా ఉన్న అలాంటి సినిమాల నుంచి తప్పించుకోవచ్చు. కాని అడిక్షన్‌ కేటగరీలో ప్రసారమవుతున్న వాటి నుంచి ఎలా తప్పించుకోగలుతామనేది ప్రశ్న. నియంత్రణ ప్రక్రియలేని అలాంటి సిరీస్, సినిమాల నిండా   బూతులు, పెద్దవాళ్లు కూడా ఇబ్బంది పడే దృశ్యాలు ఉంటున్నాయన్నది కామెంట్‌. ఇదివరకు హాలీవుడ్‌ సినిమాల్లో కూడా అసభ్యకరమైన సీన్స్‌ ఏవైనా ఉంటే ఇక్కడకొచ్చాక సెన్సార్‌ అయ్యేవి. ఓటీటీ విషయంలో స్థానిక కంటెంట్‌క్కూడా అలాంటి సెన్సార్‌షిప్‌ లేదు. ఇందులో ప్రసారం అయ్యే సిరీస్‌లు, సినిమాల్లో పోర్న్‌ను తలపించే దృశ్యాలుంటున్నాయి. ఇంటిల్లిపాదీ కాదు కదా.. ఎవరికి వారు విడివిడిగా చూడ్డానికీ ఇబ్బందిగానే ఉంటున్నాయవి అంటున్నారు చాలామంది ఓటీటీ వీక్షకులు. అమర్యాదకరమైన భాషకైతే చెప్పే పనేలేదు. హాలీవుడ్‌ సినిమాల్లో అలాంటి మాటలు వింటే పెద్దగా ఇబ్బంది ఉండదు.. ఎందుకంటే అది మన భాష కాదు కాబట్టి.. కాని తెలుగు, హిందీ సహా ప్రాంతీయ భాషల్లోనూ అలాంటివి ఉంటున్నాయి.

యువత, పిల్లల మీద అవి దుష్ప్రభావాలు చూపవా?’ అని ఇంకొంతమంది ఆవేదన. పిల్లలు చూడకుండా అలాంటి కంటెంట్‌ను లాక్‌ చేసే వెసులుబాటు ఓటీటీల్లో ఉన్నా.. టెక్నాలజీ నేటి పిల్లలకు ఉగ్గుపాలతో అందిన జ్ఞానం. పెద్దవాళ్లు ఏం చూశారు? ఏం చూస్తున్నారు అని తనిఖీ చేయడం, లాక్‌ను అన్‌లాక్‌ చేసుకోవడం వంటివి కష్టమేం కాదేమో’ అనీ అభిప్రాయప పడ్తున్నారు మరి కొంతమంది. సెక్స్‌ పక్కన పెడితే ఆ క్రైమ్‌ ఏంటండి బాబూ.. ఎన్నెన్ని నేరాలు ఎన్నెన్ని రకాలుగా చేయొచ్చు.. ఎంతెంత హింసను ప్రేరేపించొచ్చో చెప్తున్నాయి ఆ సిరీస్‌లు, సినిమాలు అంటున్నారు చాలామంది.  క్రైమ్, సెక్స్‌ జానర్‌కు చెందిన కొత్త సిరీస్, సినిమాలు స్ట్రీమ్‌ అయినప్పుడల్లా ఓటీటీకీ సెన్సార్‌షిప్‌ ఉండాల్సిందనే వాదన బలంగా వినిపిస్తూనే ఉంది.

తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ‘బాంబే బేగమ్స్‌’ విషయంలోనూ ఈ నిరసన వ్యక్తమైంది. ఇందులో మైనర్‌ పిల్లలు డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లుగా చూపించారని, వాళ్ల మీద చిత్రీకరణ అభ్యంతరకరంగా ఉందని సోషల్‌ మీడియాలో ఘాటుగానే స్పందించారు. వీటిని పరిగణనలోకి తీసుకొని ఎన్‌సీపీసీఆర్‌ (నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ చైల్డ్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌) నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులూ పంపింది ఆ సిరీస్‌ను వెంటనే నిలివేయాలని. ఓటీటీ కంటెంట్‌ విషయంలో ఇలాంటి విమర్శలూ వినిపిస్తున్నా.. అధికశాతం వీక్షకులు ఓటీటీ గొప్ప విప్లవాత్మకమైన మార్పుగానే భావిస్తున్నారు.

‘ఓటీటీతో ఎంతోమందికి అవకాశాలు దొరుకుతున్నాయి. వెరైటీ కంటెంట్, రియల్‌ టాలెంట్‌ను చూడగలుతున్నాం. దీని ఇంపాక్ట్‌ థియేటర్‌ మూవీస్‌ కంటెంట్‌ మీదా ఉంటుంది. మంచి సినిమాలు  వచ్చే స్కోప్‌ పెరుగుతుంది. స్టోరీకి స్టార్‌డమ్‌ వస్తుంది. అప్పుడే  ప్రపంచ సినిమాలో మన దేశం కూడా ప్రత్యేక స్థానం పొందుతుంది.  ఓటీటీలు టెలివిజన్‌ మీదా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. వరల్డ్‌ సిరీస్‌ చూసే చాన్స్‌ దొరుకుతుంది. కాబట్టి ఆడియెన్స్‌ అభిరుచీ మారి టెలివిజన్‌లోనూ అలాంటి సీరియళ్ల కోసం  డిమాండ్‌ పెరిగే టైమ్‌ వస్తుంది. అత్తా కోడళ్ల సీరియళ్లకు కాలం చెల్లుతుంది’ అంటున్నారు. ‘క్రైమ్, సెక్స్‌పాళ్లు మోతాదుకు మించే ఉన్నా.. ఫార్వర్డ్‌ చేసుకునే వీలుంది. సో.. వాటిని చూడకుండా దాటేయొచ్చు. అయినా ఈ అపవాదునూ చెరిపేసుకొని ఓటీటీ కంటెంట్‌ వస్తే మరింత మంచిది’ అనీ అభిప్రాయపడుతున్నారు.  ‘ఓటీటీ పుణ్యమాని పల్లెటూర్లో ఉన్నవాళ్లకూ రేర్‌ సినిమాలు, డాక్యుమెంటరీస్, బయోగ్రఫీలు చూసే చాన్స్‌ దొరుకుతోంది. నిజంగానే టెక్నాలజీ పేద, ధనిక, పల్లె, పట్నం అన్న తేడా లేకుండా చేసింది. మాకైతే ఇది శుభపరిణామమే’ అంటున్నారు కొంతమంది యూత్‌.

ప్రతి మార్పుకి సానుకూల, ప్రతికూలతలు ఉంటాయి. ఇందుకు ఓటీటీ మినహాయింపేం కాదు. అయినా సినిమాకు, టెలివిజన్‌కు ఇదొక ప్రత్యామ్నాయ మాధ్యమం. సెన్సార్‌ షిప్‌ ఉంటే మంచిదే. లేకున్నా వీక్షకులను మించిన తీర్పరులెవరుంటారు! సమాచార వెల్లువలో తాళ్లుతప్పలు తేలిపోక తప్పదు. ఘనం స్థిరపడక పోదు.

మన దేశంలో ఓటీటీకి పదమూడేళ్లు. 2008లో తొలి డిపెండెంట్‌ ఓటీటీగా బిగ్‌ఫ్లిక్స్‌ లాంచ్‌ అయింది. తర్వాత రెండేళ్లకు మొదటి మొబైల్‌ యాప్‌గా n్ఛ్ఠఎ్టఠి వచ్చింది. 2013లో డిటో టీవీ, సోనీ లివ్‌తో ఓటీటీ మూవ్‌మెంట్‌ ఊపందుకుంది. 2015లో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్, 2016లో అమెజాన్‌ ప్రైమ్‌తో ఓటీటీ మార్కెట్‌లో పోటీ ఓ స్థాయికి వెళ్లింది. ప్రస్తుతం 40కి పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ తమ సర్వీసులను అందిస్తున్నాయి. తెలుగులో స్ట్రీమింగ్‌ సేవల్లో ఉన్న ప్లాట్‌ఫామ్స్‌ ఆహా, ఊర్వశి.  

సినిమా స్టార్స్‌..
ఇదివరకు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతే నటీనటులు, సాంకేతిక నిపుణుల కెరీరూ ముగిసిపోయేది. టెలివిజన్‌ వచ్చినా.. అందులో నటించడం చిన్నతనంగా భావించిన నటీనటులూ ఉన్నారు. కాని ఓటీటీ అలాంటి సంకోచాలకు చెక్‌ పెట్టింది. సినిమాల్లో ఇబ్బడిముబ్బడి అవకాశాలున్నా ఓటీటీలో సైన్‌ చేయడానికి ఉత్సాహపడ్తున్న స్టార్స్, టెక్నీషియన్స్‌ టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ దాకా ఉన్నారు. కరోనాతో ఆ ఒరవడి మరింత స్థిరపడింది. పెద్ద తెరకన్నా బుల్లితెరే పదిలం అన్న భరోసానిచ్చింది. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమ శైలిని చూపించిన తరుణ్‌ భాస్కర్, నాగ్‌ అశ్విన్‌ వంటి దర్శకులు ఓటీటీకీ క్లాప్‌ కొట్టారు ‘పిట్ట కథలు’ ఆన్‌థాలజీతో. అలాగే జగపతి బాబు, అమలా పాల్, శ్రుతి హాసన్‌ వంటి స్టార్లూ ఓటీటీలో కనిపించారు.

బాలీవుడ్‌లోనూ ఈ జాబితా పెద్దదే. కరణ్‌ జోహార్, అనురాగ్‌ కశ్యప్, దిబాకర్‌ బెనర్జీ, జోయా అఖ్తర్‌ లాంటి వాళ్లు ఓటీటీలో పాతబడి పోయారు కూడా. అజయ్‌ దేవ్‌గణ్‌ ఓటీటీ చిత్ర నిర్మాణాలను చేపట్టాడు. కరోనా వల్ల గులాబో సితాబోను ఓటీటీలో స్ట్రీమ్‌చేసి ఆ లిస్ట్‌లోకి షూజిత్‌ సర్కార్, అందులో నటించిన అమితాబ్‌ బచ్చన్, ఆయుష్మాన్‌ ఖురానాలూ చేరిపోయారు. అనురాగ్‌బసు, అభిషేక్‌ బచ్చన్, ప్రియాంకాచోప్రా, నవాజుద్దీన్‌ సిద్దీఖీ, పంకజ్‌ త్రిపాఠీ, రాజ్‌కుమార్‌రావు, సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్, సానియా మల్హోత్రా, ఫాతిమా సనాషేక్‌ తదితరులు ఓటీటీలో నేమ్‌కార్డ్‌ వేసేసుకున్నారు. ఇలా థియేటర్‌లో సినిమాతోపాటు ఓటీటీ ప్రొడక్షన్స్‌ పట్లా ఆసక్తి చూపిస్తున్న టాప్‌ స్టార్స్, టెక్నీషియన్స్‌ దాదాపు అన్ని భాషల్లోనూ ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. పని చేస్తున్నారు కూడా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top