నవరాత్రులు.. సినిమాల్లో నారీమణులు: సత్తా చూపిస్తున్న లేడీ డైరెక్టర్స్‌

Special Story On Iconic Lady Directors In Tollywood Industry In Telugu - Sakshi

సినిమా డైరెక్టర్ అనగానే మన మదిలో మెదిలేది మేల్ పోస్టరే. హాలీవుడ్ కావచ్చు. బాలీవుడ్, టాలీవుడ్ కావచ్చు. కెప్టెన్ ఆఫ్ హౌస్ మాత్రం ఖచ్చితంగా మగవాడే అన్న అభిప్రాయం అంద రిలో బలంగా పడిపోయింది. తొలి నుంచి పూర్తి స్థాయిలో మేల్ డామినేషన్ ఉండటమే అందు కు కారణం కావచ్చు. కానీ…అప్పుడు….ఇప్పుడు… మహిళా దర్శకులు స్టార్ కెమెరా, యాక్ష న్ అంటున్నారు. కాకపోతే అప్పుడప్పుడు మాత్రమే ఆ సౌండ్ వినిపిస్తూ వచ్చింది. ఇకపై టాలీవుడ్‌లో మహిళా దర్శకులు పెరగబోతున్నారా ?

హెచ్.ఎమ్.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, ఎల్.వి.ప్రసాద్, ఆదుర్తి సుబ్బారావు. ఇలా మొదలు పెట్టి చెప్పుకుంటూ పోతే....రాజమోళి, పూరి జగన్నాధ్, త్రివ్రికమ్, సుకుమార్ ఇలా పూర్తి చేయచ్చు. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. అంతా బానే ఉంది కానీ… మహానుభావురాళ్ల మాటేంటి ? తెలుగు సినీ పరిశ్రమలో మహిళా దర్శకుల ఉనికి తక్కువే. అస్సలు లేదు అనడానికి వీల్లేదు. అయితే… ఇప్పుడు పెరుగుతోంది. సక్సెస్ మంత్ర జపిస్తూ తెలుగు సినిమాని సరికొత్తగా ప్రేక్షకులకు ప్రెజంట్ చేయడానికి ఆమె రెడీ అయింది.

సినిమా. రంగుల ప్రపంచం. మరో లోకం. 24 ఫ్రేమ్స్ క్రియేటివిటీ కళకళలాడే చోటు. అలాంటి సినిమాని లీడ్ చేసేది డైరెక్టర్ మాత్రమే. డైరెక్టర్ ఆలోచనలకు తగట్టుగానే ఒక కథ సినిమాగా మారుతుంది. అంత కీలకమైన దర్శకత్వ శాఖలో మహిళలు తమ ఉనికిని చాటుకోవడం తొలి నుంచి చాలా తక్కువే. ఇప్పుడు టాలీవుడ్‌లో మహిళా దర్శకుల సంఖ్య పెరుగుతోంది. కొత్త కొత్త ఆలోచనలతో… సరికొత్త సినిమాలకి యాక్షన్ చెప్పేస్తున్నారు. 

(చదవండి: వెండితెరపై హీరోయిన్ల విశ్వరూపం)

సూర్య చేత ఆకాశమే హద్దు అనిపించింది మహిళా దర్శకురాలే. సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన ఆకాశమే నీ హద్దు రా సినిమా… న్యూ థాట్స్‌తో వస్తున్న ఉమెన్ మూవీ డైరెక్టర్స్ గురించి చెప్పకనే చెబుతుంది. త్వరలోనే సూర్యతో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతోంది సుధా. సూర్యతో చేయబోయే సినిమా ఓ బయోపిక్‌ అని ఆ మధ్య తమిళ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే అది ఎవరి జీవిత చరిత్ర అనేది మాత్రం బయట పెట్టలేదు. 

(చదవండి: హీరోయినే..హీరో)

వైజాగ్‌లో పుట్టి, పెరిగిన సుధ కొంగర తమిళ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పనిచేశారు. మొదట్లో స్క్రీన్ ప్లే రైటర్‌గా వర్క్ చేశారు. బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామాతో ఆమె తీసిన చిత్రం అటు హిందీ, ఇటు తమిళ, తెలుగు భాషల్లో విజయం సాధించింది. హిందీ, తమిళంలో మాధవన్ హీరోగా చేస్తే…తెలుగులో గురు పేరుతో తీసిన చిత్రంలో వెంకటేష్ లీడ్ రోల్ ప్లే చేశారు. 

సమంత  హిట్స్ లిస్ట్‌పై ఒక లుక్ వేస్తే వెంటనే కనిపించే సినిమా ఓ బేబీ. పెట్టిన పెట్టుబడికి డబుల్ వసూళ్లు సాధించిందీ చిత్రం. ఓ బేబీ డైరెక్టర్ నందిని రెడ్డి. సౌత్ కొరియా చిత్రం మిస్ గ్రానీకి రీమేక్ ఈ చిత్రం. అయితే…కథా వస్తువు ఆ చిత్రం నుంచి తీసు కున్నా…సినిమా అంతటా నందిని రెడ్డి మార్క్ ఫీల్, కామెడీ కనిపిస్తూనే ఉంటాయి.

లిటిల్ సోల్జర్స్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నందిని రెడ్డి…ఆ తర్వాత కృష్ణవంశీ టీమ్‌లో చాలా కాలం కొనసాగారు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్లోనూ పనిచేశారు. దర్శకు రాలు కావడానికి ముందు దశాబ్దానికి పైగానే టాలీవుడ్‌లో తన ప్రయాణం కొనసాగించారు నందిని రెడ్డి. 2011లో తొలి సినిమా అలా మొదలైంది విడుదలైంది. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన నందినిరెడ్డి…ఆ తర్వాత  ఓ…బేబీ అంటూ ప్రేక్షకులకు మరో మంచి మూవీని అందించారు. 

నందిని రెడ్డి నుంచి సుధా కొంగర దాకా ఫీమేల్ డైరెక్టర్స్‌ ఇండస్ట్రీ కొత్త కళని సంతరించుకుం టోంది కదా. కరోనా ముప్పు పూర్తిగా తగ్గిన తర్వాత ఆ జోష్ మరింత పెరిగింది. అయి తే….తెలుగు చిత్ర పరిశ్రమకి మహిళా దర్శకులు కొత్తేం కాదు. గతంలోనూ ఉన్నారు. ఎన్నో హిట్ సినిమాలు తీశారు. ఆ మాటకొస్తే…గిన్నీస్‌ బుక్‌లో తెలుగు సినిమాని ఎక్కించింది కూడా తెలుగు దర్శకురాలే. డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే ఆయా పాత్రల్లో జీవించిన కథానాయికలు… మెగాఫోన్ పట్టి ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించారు.

టాలీవుడ్‌లో లేడీ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే మొదట ప్రస్తావించాల్సింది విజయ నిర్మల గురించే. మొత్తం 44 సినిమాలకు ఆమె దర్శకత్వం వహించారు. ప్రపంచంలో ఏ భాష లోనూ ఇన్ని సినిమాలను ఏ లేడీ డైరెక్టర్ తీయలేదు. అందుకే…ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు తీసిన మహిళా దర్శకురాలుగా ఆమె గిన్నీస్ బుక్ లో పేరు సంపాదించారు. 1971లో తొలి చిత్రానికి దర్శకత్వం వహించారు విజయనిర్మల. అదే మీనా. ఫస్ట్ మూవీనే భారీ విజ యం సాధించింది. 

భానుమతి. నటి, నిర్మాత, గాయని మాత్రమే కాదు. దర్శకురాలు కూడా. సొంత నిర్మాణ సంస్థలో చండీరాణి చిత్రాన్ని తీశారు భానుమతి. 1953 విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్, భానుమతి హీరో, హీరోయిన్స్‌గా నటించారు. అటు నిర్మాతగా, ఇటు దర్శకురాలిగా, మరోవైపు కథానాయికగా…ఈ చిత్రంలో చాలా బాధ్యతలు పంచుకున్నారు భానువతి. అంతే కాదు. సినిమాలో ఆరు పాటలు కూడా ఆమె పాడారు. అన్నట్టు చిత్రానికి కథ అందించింది కూడా భానుమతే.

స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత చాలా మంది నిర్మాణం వైపు చూస్తారు. కానీ…మహానటి సావిత్రి మాత్రం దర్శకత్వం వైపు దృష్టి పెట్టారు. నటనతోనే కాదు. విభిన్న దర్శకురాలిగా కూడా ప్రేక్ష కులను ఆకట్టుకోవాలని ప్రయత్నించారు. ఈక్రమంలోనే చిన్నారి పాపలు, మాతృదేవత చిత్రా లకు దర్శకత్వం వహించారు. సావిత్రి, విజయనిర్మల తర్వాత సక్సెస్ మూవీస్‌తో అందరినీ ఆకట్టుకున్న మరో దర్శకురాలు బి.జయ. జర్నలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన జయ…సూపర్ హిట్ అనే సినీ వార పత్రికను స్థాపించి విజయవంతంగా నడిపారు. ఆ తర్వాత ప్రేమలో పావనీ కళ్యాణ్ చిత్రంతో దర్శకురాలిగా మారారు. మొత్తం 7 సినిమాలను డైరెక్ట్ చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top